Islamabad: నీటిని ఆపితే, భారత్ శ్వాస ఆపేస్తారట.. పాక్ సైనికాధికారి పిచ్చి మాటలు…!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం.. పాకిస్తాన్ (Pakistan)ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పాక్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయాన్ని ఈ చర్య తీవ్రంగా దెబ్బతీయనుంది. దీంతో అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ఒత్తిడిని పాక్ సర్కార్, సైన్యం కూడా ఎదుర్కొంటోంది. దీంతో దౌత్య పరిభాష వదలి.. పాక్ నేతలు ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. పాక్ సర్కార్.. అణుబూచిని చూపిస్తుంటే.. సాక్షాత్తూ పాక్ సైనికాధికారులు కూడా క్రమశిక్షణ మరిచి… ఉగ్రభాష అందుకున్నారు.
తాజాగా పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ భారత్‌పై ప్రేలాపనలు పేలారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ ప్రసంగిస్తూ..‘‘భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో (Indus River) జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’’ అని అన్నారు.
ఆయన వ్యాఖ్యలను అఫ్ఘాన్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియం సోలైమాంఖిల్ తీవ్రంగా ఖండించారు. దేశానికి చెందిన ఓ సైనికాధికారి ఇలా మాట్లాడటం సరైన చర్య కాదని అన్నారు. లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అన్నారు. ‘‘కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’’ అని అతడు అన్నాడని గుర్తు చేశారు. పాక్ అధికారులు అక్కడి ఉగ్రవాదుల స్క్రిప్ట్‌ను చదువుతున్నట్లు ఉందని పేర్కొన్నారు.
1960ల్లో భారత్, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును న్యూఢిల్లీ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో పాక్ నేతలు భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో (Bilawal Bhutto), పాక్ (Pakistan) రక్షణ మంత్రి సైతం ఇటీవల ఈ విషయంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. గతంలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.