రణక్షేత్రంలో ఒంటరిగా నెతన్యాహు..?
హమాస్ తో యుద్ధం కొనసాగుతుండడం, ఎంతకూ ఫలితం రాకపోవడం.. ఇజ్రాయెలీ వాసుల్లో ఆందోళనకు కారణమవుతోంది. హమాస్ నేతలను తమ దళాలు కాల్చిచంపుతుంటే.. బంధీలుగా ఉన్న తమ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఇజ్రాయెల్ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ హింసాకాండ తమకు వద్దని.. హమాస్ తో డీల్ చేసుకోవాలని కోరుతున్నారు. అయినా ప్రధాని నెతన్యాహు మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు. దీంతో నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో నిరసనలు ఉధృతమవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతుండటం, ఇటీవల ఆరుగురు బందీల మృతిపై అమెరికాతోపాటు అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కు గట్టి మద్దతుదారు, మిత్రదేశమైన బ్రిటన్.. తన వైఖరిలో క్రమంగా మార్పు చూపిస్తోంది. నెతన్యాహు వైఖరిపై కాస్త అసంతృప్తితో ఉన్న బ్రిటన్.. ఇజ్రాయెల్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు …. బ్రిటన్ నిర్ణయం సిగ్గుచేటన్నారు.. ‘‘బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం హమాస్‌ను ఓడించాలనే తమ సంకల్పాన్ని ఏమాత్రం మార్చదన్నారు.
14 మంది బ్రిటిష్ పౌరులతోపాటు 1200 ఇజ్రాయెల్ వాసులను హమాస్ పొట్టనపెట్టుకున్న చరిత్ర హమాస్దని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవకుండా.. బ్రిటన్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం హమాస్ చర్యలను మరింత ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు బెంజమిన్ నెతన్యాహు . ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్.. కొన్ని రకాల ఆయుధాల సరఫరాను టెల్ అవీవ్‌కు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేందుకు ఆ ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ ల్యామీ పేర్కొన్నారు. మరోవైపు, నెతన్యాహు చర్యలను అమెరికా కూడా తప్పుపడుతోంది. చర్చలు ఫలప్రదం కావడానికి తగిన ప్రయత్నాలను నెతన్యాహు చేయడం లేదన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు..






