ముడా స్కామ్ లో సిద్ధరామయ్యకు షాక్… విచారణకు గవర్నర్ నోటీసులు

కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. ముడా స్కామ్ లో పూర్తిగా చిక్కుకుపోయారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అర్థం వస్తోంది. నిన్నటి వరకూ బీజేపీ, జేడీఎస్ మాత్రమే విమర్శలు చేశాయి. ర్యాలీలు, ఆందోళనలతో అట్టుడికించాయి. పదిరోజుల ర్యాలీలో కాంగ్రెస్ పైనా, సీఎం సిద్ధరామయ్యపైనా విరుచుకుపడ్డాయి.వీటికి సమాధానం చెప్పడంలో ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. తన భార్య పార్వతి పేరు మీద ఉన్న ప్లాట్స్…. బీజేపీ గవర్నమెంట్ హయాంలోనే వచ్చాయని సిద్ధూ చెబుతున్నా.. అది అంతగా జనంలోకి వెళ్లలేదన్నది వాస్తవం.
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ నోటీసులిచ్చారు.
2014లో తాను సీఎంగా ఉన్నప్పుడే పార్వతి ఈ స్థలాల కోసం విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు సిద్ధరామయ్య.. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో తాను.. అందుకు అనుమతి ఇవ్వలేదన్నారు.. ఈ భూములు కేటాయించింది 2021లో. అప్పుడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ ఆరోపణలపై ఇంతవరకు ఏ విచారణ అధికారీ నివేదిక ఇవ్వలేదు’ అని సిద్ధూ బదులిచ్చారు.
శనివారం రాజ్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ప్రభుశంకర్ జారీచేసిన ఉత్తర్వులో అవినీతి నిరోధక చట్టం-17ఏ ప్రకారం ముఖ్యమంత్రిని విచారించేందుకు అనుమతించారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని సీఎం సిద్ధూ ఖండించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలో మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గహ్లోత్ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.