Port Louis: మారిషస్ లో మోడీ రెండురోజుల పర్యటన.. ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం..
రెండురోజుల మారిషస్ పర్యటనలో భాగంగా పోర్ట్ లూయీ చేరుకున్న ప్రధాని మోడీ(Modi) కి .. సంప్రదాయ ఆతిథ్యం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్గులాం తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి హోటల్‌కు చేరుకున్న మోడీకి భారత సంతతి ప్రజల నుంచి గీత్ గవాయ్‌గా పేరుగాంచిన సంప్రదాయ బిహారీ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భోజ్‌పురి వారసత్వం గల మహిళలు పాల్గొన్నారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-మారిషస్(Mauritius) నిర్ణయించాయి. వివిధ రంగాల్లో గల ప్రత్యేక, సన్నిహిత సంబంధాల పటిష్ఠానికి చర్యలు తీసుకోవాలని నిశ్చయించాయి. ఈ మేరకు మారిషస్ రాజధాని పోర్ట్ లూయీలో మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ చర్చలు జరిపారు.
అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణీ సంగమం ప్రాంతం మహాకుంభ్ నుంచి తీసుకెళ్లిన గంగాజలాన్ని ఇత్తడి, రాగితో తయారుచేసిన మరచెంబులో గోకుల్‌కు మోడీ బహూకరించారు. ఆయన భార్య బృందా గోకుల్‌కు సడేలీ పెట్టె (గుజరాత్లో చెక్కతో కళాత్మకంగా రూపొందించే పెట్టె)లో బెనారస్ జరీ చీరను అందించారు. దీంతో పాటు పౌష్టికాహారం(సూపర్‌ఫుడ్)గా పేరుగాంచిన మఖానా సహా మరికొన్ని బహుమతులను వారికి అందించారు. అలాగే గోకుల్ దంపతులిద్దరికి ప్రవాస భారతీయుడు హోదా (ఓసీఐ) కార్డులను అందించారు.
రామ్గులాం దంపతులకు ఓసీఐ హోదా
భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్’ను ప్రదానం చేయనున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్గులాం ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోడీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.మార్చి 12, 1992న మారిషస్ స్వతంత్ర దేశంగా మారిన నాటి నుంచి ఐదుగురు విదేశీ ప్రముఖులను ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం’తో సత్కరించారని రామ్‌గులం అన్నారు. 1998లో జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా దీనిని మొదటిసారిగా అందుకున్నారని ఆయన అన్నారు.






