Carney: అమెరికాతో ట్రేడ్ వార్ కు సిద్ధమే… కెనడా ప్రధాని కార్నీ కీలక ప్రకటన..
కెనడా కొత్త ప్రధాని తన పంథా ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ముందు అమెరికాతో వాణిజ్య యుద్ధం, జాతీయ ఎన్నికల వంటి సవాళ్లున్నాయి. ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో వాటిపై ఆయన స్పందించారు. ‘మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. ఆయనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump). ఇది మనందరికీ తెలుసు. మనం నిర్మించుకున్న, మనం విక్రయించే.. వాటిపై అన్యాయమైన సుంకాలను విధించారు. ఆయన కెనడా కుటుంబాలు, కార్మికులు, వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించనీయం. అమెరికన్లు మనపై గౌరవం ప్రదర్శించే వరకూ ప్రతీకార సుంకాలను విధిస్తూనే ఉంటాం. మనం ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ అలాంటి పరిస్థితి వస్తే కెనడియన్లు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. హాకీలో మాదిరిగా వాణిజ్యంలో అమెరికా తప్పులు చేయకూడదు. చేస్తే కెనడా విజయం సాధిస్తుందన్నారు కార్నీ.
‘మన వనరులు, నీరు, భూమి, దేశం కావాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. ఈ విషయంలో వారు విజయం సాధిస్తే మన జీవితాలను ధ్వంసం చేస్తారు. అమెరికాలో వైద్య సేవ ఒక వ్యాపారం, అదే కెనడాలో హక్కు. అమెరికా కరిగిపోతున్న కుండలాంటిది. కెనడా మొజాయిక్ వంటిది. అమెరికా అంటే కెనడా కాదు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాదు. ఇవి చీకటి రోజులు. మనం ఎప్పటికీ నమ్మని దేశం తీసుకొచ్చిన చీకటి ఇది. షాక్ నుంచి మనం ఇప్పుడు కోలుకుంటున్నాం. కానీ ఈ పాఠాలను మర్చిపోవద్దు. భవిష్యత్తులో ఎదురయ్యే కఠినమైన రోజులను కలిసికట్టుగా అధిగమిద్దాం’ అని కార్నీ పిలుపునిచ్చారు.
ఎప్పుడైతే కెనడా(Canada) సైతం సుంకాలు విధించడం మొదలు పెట్టిందో అమెరికన్లకు కూడా సమస్యలు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా కలప, పొటాష్ సహా పలు వస్తువులను కెనడా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాటిపై భారీగా ట్యాక్స్ విధిస్తే.. అది అమెరికన్లకే పెను ఇబ్బందిని సృష్టిస్తుంది. ఫలితంగా అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది మాంద్యానికి దారితీసే ప్రమాదముందన్న అంచనాలున్నాయి.






