అంతర్జాతీయ సమాజమా…? ఆదుకోవా…?
హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటినుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమస్థానంలో ఉంటోందని ముయిజ్జు ఆవేదన వ్యక్తంచేశారు. ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు.
పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు (ఎస్ఐడీఎస్) ప్రతీ పదేళ్లకోసారి సమావేశమవుతుంటాయి. ఇక్కడ ఆయా దేశాల అభివృద్ధే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, అటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే.. అందులో కేవలం 14శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు వ్యాఖ్యానించారు. కానీ, ప్రపంచ ద్రవ్యనిధి (IMF) లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడీపీ చిలీ, మెక్సికో, మలేషియా, చైనా తలసరి జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం 500 మిలియన్ డాలర్ల ధనం అవసరమవుతుందని ముయిజ్జు పేర్కొన్నారు.
ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంతపెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారమవుతుందన్నారు. తొలిసారిగా 1994లో మొదటి ఎస్ఐడీఎస్ సమావేశం జరిగింది. సముద్రజలాలు పెరగడం వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. మాల్దీవులలోని 1,192 ప్రాంతాల్లో యేటా సముద్ర మట్టం 3.3 అడుగుల మేర పెరుగుతుందని అంచనా వేశారు. అయితే, అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ముందస్తు చర్యల్లో భాగంగా మాలె సమీపంలో సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తులో 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ దీవిని నిర్మించి పర్యటకానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్తపడ్డారు.
మరోవైపు గతేడాది సెప్టెంబరులో అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు.. పెరుగుతున్న సముద్రమట్టం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు దాదాపు 30వేల అపార్ట్మెంట్లతో ‘రాస్ మాలె’ పేరిట కృత్రిమ ద్వీపాన్ని ఆవిష్కరించారు. అయితే, దీనిని మౌలిక సదుపాయాల కల్పనగా వర్గీకరించినందున వాతావరణ నిధులకు అర్హత సాధించలేకపోయింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మాల్దీవులలోని కీలక నిర్మాణపనులను చైనా సంస్థలకే కట్టబెడుతున్నారు.






