London: జై శంకర్ పర్యటనలో ఖలిస్తానీ(Khalistan) వాదుల కలకలం…
బ్రిటిష్ రాజధాని లండన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఖలిస్తానీ మద్దతుదారులు చాథమ్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు. ఆ క్రమంలో భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్‌కు కఠినమైన సూచనలు జారీ చేసింది. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ సంఘటనను ఖండించింది. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఎలాంటి బెదిరింపులను అంగీకరించబోమని హెచ్చరించింది.
బుధవారం ఎస్. జైశంకర్ చాథమ్ హౌస్‌లో జరిగిన కార్యక్రమం అనంతరం బయలుదేరుతున్న సమయంలో ఖలిస్తానీ నిరసనకారులు “భారత వ్యతిరేక” నినాదాలు చేస్తూ భద్రతా వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పసుపు జెండాలను పట్టుకున్న నిరసనకారులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్లు కనిపించారు. జైశంకర్ కదలడం ప్రారంభించిన వెంటనే, ఒక వ్యక్తి పోలీసు బారికేడ్‌ను బద్దలు కొట్టి, ఆయన కాన్వాయ్ ముందుకు వచ్చి దారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ క్రమంలోనే పోలీసులు వెంటనే అప్రమత్తమై, అతన్ని అక్కడి నుంచి తొలగించి, అరెస్టు చేశారు.
బ్రిటన్, భారతదేశం నుంచి తీవ్ర స్పందన
బ్రిటిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను ఖండిస్తూ ‘ఇటువంటి బెదిరింపు చర్యలను మేము తిరస్కరిస్తున్నామని పేర్కొంది. మెట్రోపాలిటన్ పోలీసులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారని కూడా తెలిపారు. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిన్న వేర్పాటువాద, తీవ్రవాద సమూహం రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి అంశాలు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయని, ఆతిథ్య దేశం (బ్రిటన్) తన దౌత్య బాధ్యతలను నిర్వర్తించాలని పేర్కొన్నారు.
బుధవారం చెవెనింగ్ హౌస్‌లో జైశంకర్ యుకె విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో చర్చలు జరుపుతున్న సమయంలో ఈ భద్రతా ఉల్లంఘన జరిగింది. చెవెనింగ్ హౌస్‌లో ఇద్దరు నాయకులు “ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. వీటిలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు కూడా ఉన్నాయి. చాథమ్ హౌస్ వద్ద నిరసనకారులను ఆపడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో భారతదేశం, బ్రిటన్ మధ్య సంబంధాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.. దీంతోపాటు అక్కడి భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.






