Kesineni Brothers: కేశినేని అన్నదమ్ముల మధ్య సోషల్ మీడియా యుద్ధం..

విజయవాడ రాజకీయాల్లో కేశినేని అన్నదమ్ముల (Kesineni Brothers) మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాము రాజకీయంగా ఎవరు ఎక్కువ శక్తివంతులమనే పోటీలో అన్నదమ్ములు నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా పేర్లు చెప్పకుండా చురకలంటిస్తున్నారు. ఒకరు “చార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj)” అని అంటుంటే, మరొకరు “సోషల్ మీడియా రోడ్లపై తిరుగుతున్న సైకో” అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ విభేదాలు సామాజిక మాధ్యమాల్లో హీట్ పెంచుతున్నాయి.
గత ఎన్నికల్లో కేశినేని నాని (Kesineni Nani), తన తమ్ముడు కేశినేని చిన్ని (Kesineni Chinni) మధ్య పోటీ జరిగిన సంగతి తెలిసిందే. తమ్ముడు చేతిలో ఓడిపోయిన నాని తర్వాత రాజకీయ విరమణ ప్రకటించినా, ఇటీవల మళ్లీ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ (TDP)తో మళ్లీ టచ్‌లోకి వెళ్లారని చెబుతుంటే, చిన్ని మాత్రం నాని ప్రవేశంపై స్పష్టత అవసరం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా గతంలో తెలుగుదేశం నాయకులైన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) లపై నాని చేసిన విమర్శలే ఇప్పుడు ఆయనకు అడ్డు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఈ పరిస్థితుల్లో నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలతో చిన్ని మీద విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విజయవాడలోని ఎంపీ కార్యాలయానికి ఎన్టీఆర్ (NTR) పేరు పెట్టిన విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ గారికి ఉన్న గౌరవాన్ని కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలతో మచ్చలు పెట్టారని ఆరోపించారు. ఇసుక, ఫ్లై ఆష్, గ్రావెల్ వ్యాపారం, భూ దందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా వంటివి అక్కడ జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ, “ఎన్టీఆర్ భవన్” (NTR Bhavan) అనే పేరును “చార్లెస్ శోభరాజ్ భవన్ (Charles Sobhraj Bhavan)”గా మార్చుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దీనికి ఎంపీ చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. నాని పై “సైకో” అన్న పదాన్ని వాడుతూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. “ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక: మతి భ్రమించి సోషల్ మీడియా రోడ్లపై తిరుగుతున్న సైకో. అభివృద్ధిపై విషం చిమ్ముతున్న వ్యక్తి. స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి” అని ట్వీట్ చేశారు. ఈ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా పోరు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వారి అభిమానులు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ విభేదం రాజకీయంగా ఎటు దారితీస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది.