అపర భగీరథుడు కన్నయ్యనాయుడు..

కన్నయ్యనాయుడు..ఈపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కర్నాటక జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయిన సమయంలో.. ఈయన అపరభగీరథుడిలా మారాడు. ఏపీ, కర్నాటక ప్రభుత్వాల వినతితో రంగంలోకి దిగి.. ప్రాజెక్టును పరిరక్షించడంలో కీలకపాత్ర పోషించాడు.తుంగభద్ర బోర్డు అధికారులే చేతులెత్తేసిన చోట.. కేవలం వారం రోజుల్లో గేటుకు ప్రత్యామ్నాయంగా సాఫ్ట్ లాగ్ గేట్లను ఏర్పాటు చేసి వాహ్ వా అనిపించుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలతో ప్రశంసలు అందుకున్నారు నాయుడు.
ఇంతకూ ఈ కన్నయ్యనాయుడు ఎవరు?
దేశంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమస్య తలెత్తినా గుర్తొచ్చే పేరు నాగినేని కన్నయ్యనాయుడు. తెలుగునాట పుట్టి, కన్నడనాట ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకుని.. నేడు తుంగభద్ర నదీ తీరాన సేదదీరుతున్నారు ఈరిటైర్డ్ ఇంజినీర్ . కన్నయ్యనాయుడు..చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో 1946లో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం… తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్స్ కంపెనీలో ఐదేళ్లు పనిచేసిన ఆయన.. హోసపేటే సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో చేరారు. ఈ క్రమంలో డిజైన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా, సీనియర్ మేనేజర్ గా 2002 వరకూ సుమారు 26 ఏళ్లపాటు పనిచేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 250 ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో… కర్ణాటక రాష్ట్రంలోని కీలకమైన నారాయణపూర్, ఆలమట్టి, భద్రా, సుఫా, హేమావతి డ్యామ్ లతోపాటు తుంగ బ్యారేజీ నిర్మాణంలోనూ ఆయన టెక్నికల్ గా సహాయ సహకారాలందించారు. ఇక ఉమ్మడి ఏపీ విషయానికొస్తే.. నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, జూరాల డ్యామ్ గేట్ల నిర్మాణంలోనూ, మరమ్మత్తులోనూ కన్నయ్యనాయుడి పాత్ర కీలకం.
ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం తగ్గించకుండానే గేటుకు మరమ్మత్తులు చేయించిన ఘనత ఆయన సొంతం. ఇదే క్రమంలో… మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ ప్రాజెక్టుల్లో సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రస్తుతం తుంగభద్ర నదీ తీరాన సేదతీరుతూ ఎనభై ఏళ్ల వయసులోనూ చెరగని చిరునవ్వుతో, తరగని ఉత్సాహంతో యువ ఇంజినీర్లకు మార్గదర్శనం చేస్తున్నారు ఈ అద్భుత ఇంజినీర్ కన్నయ్యనాయుడు.