కశ్మీర్ పొత్తుల్లో ప్రతిష్టంభన..

జమ్మూ కశ్మీర్ లో బీజేపీ అధికారంలో రాకుండా చూడడమే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కశ్మీర్ లో కీలక మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు కుదుర్చుకుంది. అయితే సీట్ల సర్దుబాటులో మాత్రం ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రబుల్ షూటర్లను రంగంలోకి దించింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఈసమయంలో తలెత్తిన సమస్యను పరిష్క రించేందుకు గానూ…పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలను ట్రబుల్ షూటర్స్‌గా శ్రీనగర్‌కు పంపినట్లు సమాచారం. తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఆగస్టు 27తుది గడువు. దీంతో విభేదాలను తొలగించేందుకు హస్తం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపినట్లు తెలుస్తోంది. వీరు ఫరూక్ అబ్దుల్లాతో పాటు ఆయన కుమారుడు ఒమర్ తో నూ భేటీ కానున్నట్లు సమాచారం.
ఇటీవల రెండు పార్టీల సమావేశంలో కశ్మీర్‌లోయలో కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు.. జమ్మూకశ్మీర్‌లో 28 నుంచి 30 సీట్లలో పోటీ చేయాలని ఎన్‌సీ ప్రతిపాదించింది. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మరికొన్ని స్థానాలు కావాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ అంశం ఇరు పార్టీల మధ్య విభేదాలకు కారణమైనట్లు సమాచారం. ఎన్నికల వేళ అడ్డంకులను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 2014లో చివరగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
2019లో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. వచ్చే నెలలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఫలితాలు వెలువడనున్నాయి.