Iran: అణు ఆంక్షలతో బెదిరేది లేదు… అగ్రరాజ్య ఆధిపత్యాన్ని అంగీకరించమన్న ఇరాన్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) అన్ని దేశాలు తాను చెప్పినట్లు వినాలంటున్నారు. నయానో,భయానో దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈవిషయంలో చాలా దేశాలు ఎందుకొచ్చిన గొడవ ఎంతైనా అమెరికా అధ్యక్షుడు కదా అని సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కానీ అమెరికాను ఏళ్ల తరబడి విపరీతంగా వ్యతిరేకించిన ఇరాన్ మాత్రం.. తగ్గేదే లేదంటోంది. మీరు మమ్మల్ని బెదిరించలేరు మిస్టర్ ట్రంప్ అని స్టేట్ మెంటిచ్చేస్తోంది
అణుఒప్పందం(Nuke)పై అగ్రరాజ్యంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. ‘అమెరికా మాకు ఆదేశాలు ఇవ్వడం, బెదిరించడం ఆమోదయోగ్యం కాదు. ట్రంప్‌తో చర్చలు జరిపే ఉద్దేశం నాకు లేదు. ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’’ అని పెజిష్కియాన్ కుండ బద్దలు కొట్టారు.
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్.. టెహ్రాన్‌తో చర్చలకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ (85)కి తాను లేఖ రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై సైనిక చర్య, ఒప్పందం అనే రెండు మార్గాలను ట్రంప్ సూచించారు. తాను ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తానని, టెహ్రాన్‌ను దెబ్బతీయడం ఇష్టం లేదన్నారు. ఈ ప్రతిపాదనపై ఆయతొల్లా ఖమేనీ ఇటీవల స్పందించారు. అమెరికా చర్చలు …సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉన్నాయని విమర్శించారు. టెహ్రాన్‌ను ఎదిరించలేక.. ట్రంప్ చర్చలు అనే కొత్త వ్యూహం పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత సుదీర్ఘ కాలం పాటు అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించింది, 1995 నుండి ఆంక్షలు మరింత విస్తృతమయ్యాయి.మరీ ముఖ్యంగా 2011లో ఆంక్షలను మరింతగా అమెరికా విస్తరింపజేసింది.ఇరాన్‌తో గతంలో అణుఒప్పందం చేసుకున్న అమెరికా.. 2018లో ట్రంప్ హయాంలోనే దాన్నుంచి వైదొలిగింది. ఇది ఇరాన్ ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చే ఆంక్షలకు దారితీసింది. ఎప్పుడైతే లెబనాన్ లో ఉగ్రవాద గ్రూపులపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. దానికి అమెరికా అండగా నిలిచింది. అంతేకాదు.. ఇరాన్ కమాండర్లను లేపేసింది. ఈపరిణామాలతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. అమెరికాను దారికి తేవాలంటే కచ్చితంగా అణుకార్యక్రమం పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని సైతం ఇరాన్ అభివృద్ధి చేస్తోంది. ఇరాన్ కనుక అణ్వాయుధాలు పోగేస్తే జరిగేది అనర్ధమే అని తలచిన అమెరికా.. ఇప్పుడు అణు నియంత్రణపై చర్చకు రావాలని పిలుస్తోంది.






