Islamabad: ట్రైన్ హైజాక్ ఘటనతో అభద్రతాభావం.. పొరుగుదేశాలపై నింద వేస్తున్న పాక్
ట్రైన్ హైజాక్ ఘటనతో పాకిస్తాన్ (Pakistan) లో భద్రత ఎంత ఘోరంగా ఉంటుందన్నది ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చింది. మరీ ముఖ్యంగా ఓ మిలిటెంట్ సంస్థ.. ఏకంగా పాక్ సైన్యం, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ట్రైన్ ను హైజాక్ చేసి సవాల్ విసిరారు. ఈ పరిణామం ప్రపంచదేశాల్లో పాక్ ఆర్మీ, ప్రభుత్వం పరువును ఘోరంగా పతనం చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఘటనను ఎలా ప్రపంచం ముందు ఉంచాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. దీన్ని కూడా విదేశీ కుట్రగా అభివర్ణించేందుకు ప్రయత్నిస్తోంది పాక్.
తమ దేశంలో జరుగుతున్న హింసకు భారత్, ఆఫ్గనిస్తాన్ కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ మరోసారి భారత్ పై విషం చిమ్మింది. పాక్ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పిందించింది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
పాకిస్తాన్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని భారతదేశం(india) పేర్కొంది. పాకిస్తాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులపై వేలెత్తి చూపించడానికి బదులుగా తనను తాను చూసుకోవాలని చురకలంటించింది.
మరోవైపు ఈ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్గనిస్తాన్(Afghanistan) ఉగ్రవాదుల ప్రమేయం ఉందన్న పాక్ కు పొరుగుదేశం గట్టి కౌంటరిచ్చింది. పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలకు బదులుగా వారి స్వంత భద్రత , అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ ను కోరుతున్నాము’’ అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్కీ అన్నారు.






