మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా..?
పాశ్చాత్య ప్రపంచం ఫోకస్… అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై.. యావత్ ప్రపంచం ఫోకస్ పెట్టింది. రోజురోజుకూ సూపర్ పవర్ గా మారుతున్న భారత్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. తమతో ఎలాంటి సంబంధాలు నెరుపనుంది అన్న ఆసక్తి ఆయా దేశాల్లోని అధినేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాల్లోని మీడియా భారత ఎన్నికలపై భారీ కవరేజ్ ఇస్తోంది. ఎన్నికల కసరత్తు మొదలు.. ప్రధాన పార్టీల ప్రచారాల తీరు, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సీఎన్ఎన్ మొదలు బీబీసీ, ఫ్రాన్స్24, అల్‌జజీరా, గ్లోబల్ టైమ్స్ వంటి అగ్రశ్రేణి మీడియా సంస్థలు పోటాపోటీగా విస్తృత స్థాయిలో కథనాలు ప్రచురించాయి. తుది ఫలితాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
సీఎన్ఎన్ మెగా కవరేజ్..
సార్వత్రిక సమరంలో దాదాపు 96 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని.. ఇది అమెరికా, ఈయూ జనాభా కంటే ఎక్కువని పేర్కొంటూ సీఎన్ఎన్ ఏప్రిల్‌లోనే కథనాలు మొదలుపెట్టింది. నిరుద్యోగం, సంక్షేమం, మౌలిక సదుపాయాల వంటి సమస్యలను ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ.. అసమానతలూ పెరిగాయని పేర్కొంది. ‘చెరగని సిరా’ పేరుతో పోలింగ్ రోజున వేలిపై వేసే గుర్తు, దాని తయారీ రహస్యం వంటి అనేక అంశాలతో ప్రత్యేకంగా ఓ సుదీర్ఘ కథనం రాసింది. ఎన్నికల ప్రచారాల్లో మోడీ చేసిన ప్రసంగాలు.. ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. వాటిపై విపక్షాల స్పందనలను విశ్లేషించింది. కన్యాకుమారిలోని వివేకానంద స్మారకం వద్ద ప్రధాని మోదీ ధ్యానం చేయడాన్ని ప్రత్యేక స్టోరీగా మలిచింది.
వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్..
భారీ స్థాయిలో ఎన్నికల కసరత్తుతోపాటు నిర్వహణ ప్రక్రియలో సవాళ్లపై ‘వాషింగ్టన్ పోస్టు’ వరుస కథనాలను ప్రచురించింది. ఆ తర్వాత పొలిటికల్ యాడ్స్‌పైనా స్టోరీలు ఇచ్చింది. దేశంలో మహిళలు, యువత సంప్రదాయవాదులు కారని.. వారు ఈసారి ఎటువైపు మొగ్గుచూపనున్నారనే కోణంలోనూ వార్తలు రాసింది. భారత్‌తోపాటు ఐరోపా ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ ఫొటోల వ్యాప్తిపైనా కథనాలు ఇచ్చింది. మోడీ నేతృత్వంలోని కమలదళానికి పశ్చిమ బెంగాల్లో లభిస్తోన్న ఆదరణను విశ్లేషించింది. మోడీ బలాలు, విపక్షాల నుంచి అధికార పార్టీకి ఎదురవుతోన్న సవాళ్లు, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీపై ప్రజల్లో అభిప్రాయం, ఎగ్జిట్ పోల్స్ వంటి వరుస కథనాలను ‘న్యూయార్క్ టైమ్స్’ కవర్ చేసింది.
బ్రిటిష్ మీడియా..
లోక్‌సభ ఎన్నికలు భారత్‌కే కాకుండా ప్రపంచానికీ కీలకమని ‘బీబీసీ’ తన కథనాల్లో పలు మార్లు ప్రస్తావించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్‌తో కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. అరెస్టులు, ఆరోపణలు, కృత్రిమ మేధ ప్రభావాలు, ప్రచారం తీరుపై బ్రిటిష్ మీడియా అనేక కథనాలు ఇచ్చింది. మోడీ పాపులరిటీ వెనక అమిత్ షా నిశ్శబ్ద వ్యూహాలు.. సంక్షేమ పథకాలు, భారత ఆర్థిక వ్యవస్థ మంచీచెడులు, ఓటర్లపై ఇన్ఫ్లుయెన్సర్ ల ప్రభావం వంటి కథనాలకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చారని ‘ది గార్డియన్’ పేర్కొంది.
హిందూవాదం – ఫ్రెంచ్24
దశాబ్ది పాటు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పాలనకు తాజా ఎన్నికలు రెఫరెండంగానే భావించవచ్చని ఫ్రెంచ్ మీడియా సంస్థ ఫ్రాన్స్24 తన కథనంలో అభివర్ణించింది. రామ మందిర నిర్మాణం, హిందుత్వ వాదం, ముస్లింలపై మోడీ వ్యాఖ్యలను ప్రస్తావించింది. ఎగ్జిట్ పోల్స్‌ను ఉటంకిస్తూ.. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది.
అల్ జజీరా
పెరుగుతోన్న అసమానతలు, రికార్డు స్థాయి నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పటికీ.. 2019 ఫలితాలతో పోలిస్తే ఈసారి బీజేపీ..మరింత మెరుగైన పనితీరు కనబరచనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని అల్‌జజీరా పేర్కొంది. అంతకుముందు.. దేశంలో ముస్లిమ్‌ల అణచివేతపై కథనాలు రాసింది. అయినప్పటికీ.. ప్రతిసారి సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ హ్యాట్రిక్‌కు దగ్గరయ్యారని తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణాల వెనక ‘మోడీ మ్యాజిక్’ ఉందంటూ కథనాలు రాసింది.
సార్వత్రిక ఎన్నికలు కొనసాగిన సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టి మొత్తం భారత్‌పైనా కొనసాగింది. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాల కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.






