CEC: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన..?
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై (Gyanesh Kumar) కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (India Alliance) అభిశంసన (impeachment) తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ ఆరోపణలు, బీహార్‌లో ఎస్ఐఆర్ పై విమర్శలు చేస్తోంది. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదని దుయ్యబడుతోంది. అయితే ఈసీ ఎదురుదాడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని సమాచారం.
జ్ఞానేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీవ్ కుమార్ స్థానంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు. జ్ఞానేశ్ కుమార్ గతంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. 2029 వరకు ఆయన సీఈసీగా కొనసాగనున్నారు. అయితే, ఆయన నియమితులైనప్పటి నుంచి ఎన్నికల సంఘం నిర్వహణపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవలి కాలంలో ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో లక్షలాది ఓట్లు తొలగించబడ్డాయని, ఓటర్ల హక్కులను అపహరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలను జ్ఞానేశ్ కుమార్ ఖండించారు. ఆధారాలు సమర్పించాలని లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. ఎన్నికల సంఘం తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని, అఫిడవిట్ ఇవ్వడానికి నేనొక్కడినే దొరికానా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అధికార బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నుంచి ఎందుకు అఫిడవిట్ కోరలేదని విమర్శించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి వలె తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అయితే ఈ తొలగింపు పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందితేనే సాధ్యం. ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం దీని ఉద్దేశం. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీ ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. ఇండియా కూటమి నేతలు, మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమై, అభిశంసన తీర్మానంతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు సమావేశాల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
అభిశంసన తీర్మానం పార్లమెంటులో చర్చకు వస్తే, భారత రాజకీయ చరిత్రలో ఇది అరుదైన సంఘటనగా నిలుస్తుంది. ఎన్నికల సంఘం స్వతంత్రత, దాని నిష్పక్షపాతంపై చర్చ తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని విజయవంతంగా ఆమోదింపజేయాలంటే, ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అయితే ఇండియా కూటమికి అంత బలం లేదు. కాబట్టి ఇది ఆమోదం పొందడం అసాధ్యం. కానీ అభిశంసన తీర్మానం ద్వారా ఈసీ వైఖరిపై చర్చకు అవకాశం కలుగుతుంది. ఇదే కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.







