DOHA: పశ్చిమాసియాలో సీజ్ ఫైర్.. ఫలిస్తున్న ప్రపంచదేశాల ఆశలు..
ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా(Gaza) కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు ఖతర్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హమాస్ ధృవీకరించగా.. అమెరికా అధ్యక్షుడు బైడన్ సైతం కీలక ప్రకటన చేశారు. ప్రపంచానికి శుభవార్త వినిపిస్తున్నామన్న బైడన్(biden).. శాంతి చర్చల సారాంశాన్ని ప్రజలకు తెలియజేశారు.
గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి. తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది.
ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం… హమాస్ దగ్గర ఉన్న వందమందికి పైగా బందీల్లో 30 మందిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఆరునెలల పాటు తొలిదశ ఒప్పందం అమలు జరగనుంది. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనావాసులను వదిలిపెట్టనుంది. ఆరునెలల పాటు మహిళలు, పురుషులు, చిన్నారులను ప్రాధాన్యత క్రమం అనుసరించి విడిచిపెట్టడం జరగనుంది.
ఈ తొలి దశ ఒప్పందం కచ్చితంగా అమలైన తర్వాత రెండోదశలో సమగ్ర చర్చలుంటాయి. దీని ప్రకారం గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు ఉపసంహరణ జరగాల్సి ఉంది. మొత్తం బంధీలను హమాస్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఈ దశ కూడా దాటితే మూడోదశలో చనిపోయిన బంధీల మృతదేహాలు, వారి అస్తికలు, ఇతర సామగ్రిని … బంధీల కుటుంబాలకు చేర్చాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా అమలవుతాంటున్నారు బైడన్. దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా .. తర్వాత వచ్చే ప్రభుత్వానికి సూచించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.






