France: స్వీయభద్రతపై యూరప్(Europe) దృష్టి… రష్యాతో ముప్పు ఉందన్న ఫ్రాన్స్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(trump).. ద్విదృవ ప్రపంచాన్ని కూలదోసి, బహుళ ధృవ ప్రపంచానికి బాటలు వేస్తున్నారు. మొన్నటివరకూ అయితే అమెరికా లేదంటే రష్యా అనుకూలదేశాలు అన్నట్లు ఉండేది. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా యూరోప్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మొన్నటివరకూ రష్యా విరుచుకుపడితే .. మిత్రదేశం అమెరికా ఆదుకుంటుందన్న ఆశ ఉండేది. ఆభరోసాతోనే యూరప్.. అమెరికా వెంట నడిచేది. ట్రంప్ తీరు చూశాక. ఇక మన భద్రత మనమే చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాయి యూరప్ లోని అధికదేశాలు..
ఎందుకంటే రష్యాను నిలువరించే ఉద్దేశ్యంతో నాటో(NATO)ను బలపరిచాయి యూరోపియన్ దేశాలు. అంతేకాదు.. ఆ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ.. సెక్యూరిటీ పొందాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. ట్రంప్.. అమెరికాయే ముఖ్యం.. మీరేమైనా మాకు అనవసరమంటూ తేల్చి చెబుతున్నారు ట్రంప్. ఎప్పుడైతే ఉక్రెయిన్ కు ట్రంప్ హ్యాండిచ్చారో … దెబ్బకు సీన్ మారిపోయింది. జెలెన్ స్కీ సూచించినట్లుగా యూరోప్ .. ఇప్పుడు తమ భద్రతపై దృష్టి సారిస్తున్నాయి. ముందుగా ఉక్రెయిన్ దగ్గరే రష్యాను ఆపితే.. తమ వరకూ రాదన్నది వాటి అభిప్రాయంగా ఉంది.
రష్యాతో యూరోప్ కు పెను ముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు. క్రెమ్లిన్ తన అమ్ములపొదిలోకి వేల సంఖ్యలో ట్యాంకర్లను, వందల సంఖ్యలో యుద్ధ విమానాలను అదనంగా చేరుస్తోందని అన్నారు. బడ్జెట్లో 40% నిధులను రక్షణపైనే మాస్కో ఖర్చుపెడుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుడిగా ఉండటం పిచ్చితనమే అవుతుందని, ఆ దేశాన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫ్రాన్స్ తన అణ్వస్త్రాలతో యూరోప్ ను రక్షించడానికి సిద్ధంగా ఉందని.. ఈ విషయంపై ఇతర మిత్రదేశాలతో చర్చిస్తానని తెలిపారు. అంతేకాదు..యూరప్ భవిష్యత్తును వాషింగ్టనో, మాస్కోనో నిర్ణయించకూడదని అన్నారు. ఉక్రెయిన్‌కు యూరప్ దీర్ఘకాలం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే యూరప్ దళాలను ఆ దేశంలో మోహరించాలని పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్‌కు బుధవారం నుంచి అమెరికా సైనిక నిఘా సమాచారం ఇవ్వడం ఆపేసింది. దీంతో ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. కీవ్‌కు అండగా ఉంటామని పేర్కొంది. తాము ఎప్పటికప్పుడు నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్‌తో పంచుకుంటామని తెలిపింది.
యూరప్ కు ధన్యవాదాలు: జెలెన్స్కీ
కష్టకాలంలో తమ దేశానికి యూరప్ అండగా నిలిచిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. యూరప్ భద్రతా మండలి సదస్సుకు హాజరయ్యేందుకు బ్రసెల్స్ చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఒంటరిగా లేమన్న భావనను కలిగించారంటూ…యూరప్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.






