బీజేపీ వైపు చంపై సొరెన్ చూపు..?

త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నాయకుడు చంపైయీ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న చంపై.. ఆదివారం తెల్లవారుజామున పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం ఊహాగానాలకు కారణమైంది. కుమార్తెను కలిసేందుకే దేశ రాజధానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.
అయితే, ఈలోగానే తన ‘ఎక్స్’ ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. సాయంత్రానికి సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. జేఎంఎంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని, వాటిని తట్టుకోలేకే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం, సొంతంగా పార్టీని స్థాపించడం, తోడుగా నిలిచేవారితో కలిసి ప్రయాణించడం అనే మార్గాలు తన ముందు ఉన్నాయని వివరించారు. జేఎంఎం అధిష్ఠానానికి నమ్మకస్తుడయిన చంపై.. ఫిబ్రవరి 2 నుంచి జూలై 3 వరకు సీఎంగా వ్యవహరించారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో సీఎంగా చంపైకి అవకాశం దక్కింది. హేమంత్‌కు బెయిల్ రావడంతో వైదొలగాల్సి వచ్చింది. అప్పటినుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం రాత్రి కోల్‌కతాలో బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందుతో చంపై సమావేశమయ్యారని, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సంప్రదింపుల్లో ఉన్నారని సమాచారం.
ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు
చంపై బీజేపీలోకి వెళ్తున్నారన్న కథనాల నేపథ్యంలో హేమంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుతో ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకూ బీజేపీ వెనుకాడదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లోనూ చీలిక తెచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.