Washington: యూరప్, అమెరికా బంధానికి బీటలు..? కొత్తకూటమి వైపు ట్రంప్ చూపు..?
ఉక్రెయిన్(ukraine) కు మద్దతు విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు.. అమెరికా, యూరప్ మధ్య బంధంపై ప్రభావం చూపిస్తున్నాయా..? ముఖ్యంగా ఓవల్ ఆఫీసులో తనతో వాగ్వాదానికి దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. తర్వాత యూరప్ దేశాల వద్దకు వెళ్లడం, అవి ఆయనకు మద్దతు ప్రకటించడం దీనికి ఆజ్యం పోసింది. ఈయూను కూడా దూరం పెట్టి కొత్త కూటమికి ఊపిరి పోయాలని నిర్ణయించినట్లు న్యూయార్క్ పోస్టు కథనం ప్రచురించింది. జెలెన్స్కీతో భేటీ తర్వాత వేగంగా పావులు కదుపుతున్నారు. తాజాగా ఆ దేశానికి సైనిక సాయం కట్ చేశారు. అదే సమయంలో లాటిన్(latin) అమెరికా దేశాలతో బలమైన సంబంధాలను నెలకొల్పుకొని.. ఓ కూటమిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
దీనిలోభాగంగానే జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు ఉక్రెయిన్ బాధ్యతను ..యూరప్ మిత్రదేశాలు తీసుకొనేటట్లు చేయడంపై చర్చించే అవకాశం ఉంది. యూరప్ సంక్షోభాల నుంచి అమెరికా దృష్టి మళ్లించి.. లాటిన్ అమెరికా కూటమి ఏర్పాటుచేయడంపై దృష్టిపెట్టేలా చేయాలన్నది వీరి ప్రణాళికగా తెలుస్తోంది. దీనిలోభాగంగా ఎల్ సాల్వడోర్, వెనుజువెలా ప్రతిపక్ష నేత, అర్జెంటీనా అధ్యక్షుడు వారి దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్ట్జ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘యూరప్ భద్రతకు.. ఆయాదేశాలే నాయకత్వం వహించడాన్ని మేము స్వాగతిస్తాం. అమెరికా ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుంది. వారి సంపదకు ఓ పరిమితి ఉంటుంది. ఇక వారి ఆయుధ సంపదేమీ అపరిమితం కాదు. ఇక మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని కొంత కటువుగానే మాట్లాడారు.
మరోవైపు….మాస్కో-కీవ్ మధ్య శాంతి ఒడంబడిక చాలా దూరంలో ఉంది అని జెలెన్ స్కీ(zelensky) చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ సోమవారం ట్రూత్ సోషల్లో స్పందించారు. ‘‘ఇది జెలెన్స్కీ చేసిన చెత్త ప్రకటన. దీనిని అమెరికా ఎక్కువ కాలం సహించదు. వాషింగ్టన్, యూరప్ మద్దతున్నంతకాలం ఈ వ్యక్తి అక్కడ శాంతి ఉండాలని కోరుకోడు. ఈ సమావేశాల్లో యూరప్ అతడికి మద్దతుగా ఉందన్నారు. అమెరికా లేకుండా వారు ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.






