Putin: ట్రంప్ మాటల్ని పట్టించుకోని రష్యా.. నేరుగా యుద్ధభూమికి పుతిన్..
నేను అధికారంలో ఉండి ఉంటే.. అసలు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యేదే కాదని.. ఎన్నికల ముందు ట్రంప్(Trump) గట్టిగామాట్లాడారు. అధికారంలోకి వస్తే ఒక్కరోజులో యుద్ధాన్ని నిలిపేలా చేస్తామన్నారు. అయితే ట్రంప్ వ్యవహారంపై.. రెండు రకాల వాదనలు వినిపించాయి. అధికశాతం మంది ట్రంప్, పుతిన్ మధ్య సాన్నిహిత్యం తెలిసి ఉండడంతో.. యుద్ధం ఆగి శాంతి వికసిస్తుందని నమ్మారు. దాంతో పాటు అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అన్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతే… జనాదరణతో ట్రంప్ అధ్యక్షుడయ్యారు.
ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం యుద్దం ఆపేందుకు ట్రంప్ విపరీతంగా శ్రమిస్తున్నారు. దేశానికి ప్రధాన ప్రత్యర్థి పుతిన్ (Putin) తో సంభాషణలు సాగిస్తున్నారు. రాయభారాలు నడుపుతున్నారు. పుతిన్ కూడా ట్రంప్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. యుద్ధం ఆగడానికి ఏమేమి చేయాలో ఇప్పటికే తమ డిమాండ్లు కూడా ట్రంప్ కు వినిపించారు పుతిన్. ఓస్.. ఇంతేనా ఏముంది లే.. మనమాట కాకుండా ఉక్రెయిన్ ఏం చేయలేదు. అంతా జరిగిపోయిందని ట్రంప్ భావించారు. కానీ.. ఇక్కడే ట్రంప్ ప్లాన్స్ బూమరాంగ్ అయ్యాయి.
Trump: మూడేళ్లుగా అష్టకష్టాలు, తీవ్ర నష్టాలు ఎదుర్కొంటూ యుద్ధం చేస్తుంది.. పుతిన్ డిమాండ్లను పాటించడానికా అని జెలెన్ స్కీ ఫైరయ్యారు. అమెరికా అధ్యక్షుడి ఎదుటే తన డిమాండ్ కుండబద్దలు కొట్టారు.సరే మా వైపు నుంచి ఉన్న కొన్ని డిమాండ్లు అంగీకరిస్తే.. శాంతికి సిద్ధమే అన్నారు జెలెన్ స్కీ. సరే అని రష్యా వైపు చూస్తే… ఇప్పటికే యుద్ధవ్యూహాలను రచించిన పుతిన్.. ఇప్పుడు నేరుగా యుద్ధరంగంలో కనిపించారు. బుధవారం కర్క్స్ లో పర్యటించారు.ఈ పరిణామం ట్రంప్ కు కాస్త మండించింది.
కర్క్స్‌లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్‌కు అధ్యక్షుడు వెళ్లారు. ఆయన మిలిటరీ దుస్తుల్లో ఉన్న దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. ఈ సందర్భంగా యుద్ధ భూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్.. పుతిన్‌కు వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు సమాచారం.
అడ్డుకుంటే రష్యాకే నష్టం: ట్రంప్
ఇదిలాఉండగా.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ(zelensky) అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం’’ అని ట్రంప్ వివరించారు.
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఇందులో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈమేరకు ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది






