Washington: ఉక్రెయిన్ కు ట్రంప్ షాక్.. రష్యా డిమాండ్లకు ఓకె..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా(Russia) ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఆయన పుతిన్‌తో 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు.
అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు. ఇక శాంతి చర్చలు వెంటనే మొదలవుతాయని పేర్కొన్నారు. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ట్రంప్ రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించారన్నారు.
ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’’ అని జెలెన్స్కీ టెలిగ్రామ్ ఛానెల్లో పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై మ్యూనిచ్‌లో జరగనున్న సమావేశంలో జెలెన్స్కీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కానున్నారు. మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించబోతున్నారు. మ్యూనిక్ సదస్సు తరువాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు.






