Washington: పుతిన్, జెలెన్ స్కీ చర్చించాల్సిందే..యుద్ధం ముగింపునకు అదే పరిష్కారమన్న ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తత్త్వం బోధపడుతోంది. మొన్నటివరకూ మామద్దతుతోనే యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్.. మేం చెప్పినట్లు నడుచుకోవాలని తలిచారు. దీనికి తగ్గట్లుగానే జెలెన్ స్కీని పరిగణనలోకి తీసుకోకుండా పుతిన్ తో సౌదీలో చర్చలకు తెరలేపారు. అయితే ట్రంప్ ఊహించని విధంగా కీవ్ ప్రకటన చేసింది. తమను పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి చర్చలు జరిపినా.. తాము ఆ ఫలితాన్ని స్వీకరించమని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు చచ్చినట్లుగా జెలెన్ స్కీని సీన్ లోకి తేవాాల్సి వస్తోంది. అందుకే.. ఈ యుద్ధం, చావులు లేకుండా ఉండాలంటే.. పుతిన్(putin), జెలెన్ స్కీ(zelensky) ఒకేవేదికపై చర్చకు రావాల్సి ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు…సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. జెలెన్స్కీ ఓ నియంత అని మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ఆర్థికసాయం అందించిందని అన్నారు ట్రంప్. బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ దేశానికి అగ్రరాజ్యం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రతిగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న విస్తారమైన సహజ వనరులను యూఎస్ కంపెనీలకు అందించాలని ట్రంప్ కోరారు. ఈ ఒప్పందానికి జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు గాను ఆ దేశంతో ట్రంప్ 500 బిలియన్ డాలర్ల మేరకు డీల్‌ను ప్రతిపాదించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక ఇటీవల పేర్కొంది.అయితే..ఉక్రెయిన్‌కు చెందిన విస్తృత సహజవనరులను అమెరికాకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని తాను అడ్డుకున్నట్లు జెలెన్ స్కీ చెప్పారు.






