USA: అణ్వాయుధ పరీక్షల నిర్వహణ దిశగా అమెరికా.. ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు..!
ప్రపంచ దేశాలు అణ్వస్త్ర ఆధిపత్యం దిశగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకూ అణ్వస్త్రాలను తగ్గించడంపై ఫోకస్ పెట్టిన అమెరికా.. ఇప్పుడు తానే అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించినట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యా (Russia), చైనా (China)లు తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి..
‘ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యూఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగిఉంది. నా మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ.. ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్లలోపు అవి సమానంగా ఉంటాయి. ఇతర దేశాలు దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున.. మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధశాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
రష్యా తన ఆయుధ ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి.. అధునాతన అణు సామర్థ్యాలను విస్తరిస్తోంది. అణుశక్తి (nuclear weapons) ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ను విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో బీజింగ్ కూడా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. మరో ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు.. అమెరికా, రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యూఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. మరోవైపు.. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ అణు పరీక్షల గురించి ప్రకటన చేయడం గమనార్హం. ట్రంప్ ఆదేశాల గురించి పెంటగాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.







