Elon Musk: మై పార్టనర్ హాఫ్ ఇండియన్… భారతీయతపై మస్క్ సంచలన వ్యాఖ్యలు
టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్ .. భారతీయులపై ప్రశంసలు గుప్పించారు.జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamaths podcast) పాడ్‌కాస్ట్ ‘‘WTF is?’’లో తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాన్ మస్క్ సంచలన విషయాలు బయటపెట్టారు..తన కుటుంబంలోనూ భారతీయ మూలాలు ఉన్నాయని సగర్వంగా చెప్పుకున్నారు మస్క్. తన సహజీవన భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని చెప్పారు. అలాగే తన కుమారుడి పేరులో శేఖర్ పదం ఉందని పేర్కొన్నారు.
‘‘మీకు తెలుసో లేదో కానీ నా సహజీవన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమెను చిన్న వయసులో దత్తతకు ఇచ్చారు. కెనడాలో పెరిగింది. ఇక, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడి పేరులో శేఖర్ అనే పదం చేర్చాను’’ అని మస్క్ (Elon Musk) వెల్లడించారు.
శివోన్ జీవిత ప్రస్థానం..
యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన శివోన్.. 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో చేరారు. ఆ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సంస్థలో ఆమె డైరెక్టర్ హోదాలో ఉన్నారు. మస్క్-శివోన్‌కు నలుగురు సంతానం. ఇక, ఇదే పాడ్‌కాస్ట్‌లో మస్క్.. అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకొని కొన్నేళ్లుగా అమెరికా చాలా ప్రయోజనాలను పొందిందని వ్యాఖ్యానించారు. వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






