22న కాంగ్రెస్ ప్రజాచైతన్య ఉద్యమం..

అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన దరిమిలా.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారమిక్కడ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఆ సందర్భంగా దేశవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
‘దేశంలో జరుగుతున్న అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విస్తృతంగా కాంగ్రెస్ నేతలు చర్చించారు. అదానీ, సెబీ సంబంధాలపై హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించిన అంశాలు చాలా తీవ్రమైనవన్నారు కాంగ్రెస్ నేతలు. ఫైనాన్షియల్ మార్కెట్‌ను నియంత్రించాల్సిన సెబీయే రాజీపడింది. ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి పాత్ర పూర్తిగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఉద్యమించడంలో భాగంగా రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఘెరావ్ చేయనున్నారు.
సెబీ చైర్‌పర్సన్‌ను తొలగించాలి. విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి వీల్లేదు. జేపీసీ ద్వారా ఈ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వివరించారు. ‘సెబీకి, అదానీకి మధ్య సంబంధాలపై దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లో చిన్న మదుపరుల డబ్బును గందరగోళంలో పడేయకూడదు. మోడదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలి. దీనిపై జేపీసీని ఏర్పాటుచేయాలి’ అని ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు.
కులగణన, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ అంశాలపై ఉద్యమ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తామని.. జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తృత స్థాయిలో జనంలోకి వెళ్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.. వయనాడ్ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని సమావేశం డిమాండ్ చేసిందన్నారు. వయనాడ్ మృతులకు సంతాపం తెలిపిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, పూజాస్థలాలపై దాడులు జరగకుండా నిలిపివేసేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.