Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వంపై విమర్శలు మరింతగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం లేకపోయినట్టే అనిపిస్తుంది. నాయకులు కీర్తి గీతాలు పాడించుకుంటూ ఉన్నత స్థానంలో సంతోషంగా ఉంటారు. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ లోపల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే, దాని ప్రభావం ఎన్నికల సమయంలో స్పష్టమవుతుంది. గడచిన దశాబ్దాల్లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రజలు మార్పు కోరే ధోరణి కూడా పెరిగింది. అందుకే ఎంత బలంగా ఉన్నా కూడా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన పట్ల పైకి బాగానే ఉందని చెప్పినా, అంతర్గతంగా అసంతృప్తి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కేవలం పదిహేను నెలల్లోనే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏ వర్గానికీ పాలన పట్ల సంతృప్తి లేదని, ప్రజల సమస్యలు అలాగే మిగిలిపోయాయని తన అభిప్రాయం తెలిపారు.
గట్టిగా ఒకటిన్నర సంవత్సరకాలం కూడా కడవకముందే కూటమిలో విభేదాలు మొదలయ్యాయని చింతా మోహన్ అభిప్రాయపడుతున్నారు . బయటికి ఐక్యత చూపించినా లోపల తేడాలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. దాని ప్రభావం అసెంబ్లీ సమావేశాల్లో కూడా కనిపిస్తోందని, ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన చోట వాదోపవాదాలు, వ్యక్తిగత విమర్శలే జరుగుతున్నాయని విమర్శించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయం కాదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈవీఎంల (EVMs) విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నాయని, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజల్లో ఆ అనుమానాలను తుడిచిపెట్టేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని సూచించారు.
చింతా మోహన్ విమర్శలు వ్యక్తిగతంగానూ గట్టిగానే సాగాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం కోసం ఏమి చేశారు? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు అందించడం గానీ, కనీసం చిన్న వ్యాపార అవకాశాలు కల్పించడం గానీ జరగలేదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దళితులపై ప్రేమ ఉందని చెబుతున్న బాబు, ముఖ్యమంత్రి పదవిని రెండు సంవత్సరాల పాటు వారికే ఇవ్వాలని కొత్త డిమాండ్‌తో ముందుకు వచ్చారు.
ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేక వాతావరణం ఉన్న సమయంలో చింతా మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కూటమి పాలన నిజంగానే ప్రజలను సంతృప్తిపరచలేకపోయిందా? లేక ఇది కేవలం ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలేనా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనా ఆయన బయటపెట్టిన ఫ్యాక్ట్ షీట్ కూటమి నేతలకు అసౌకర్యం కలిగించడంలో ఎలాంటి సందేహం లేదు.