Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈసారి ఢిల్లీ (Delhi) పర్యటనను కలిసి ప్రారంభించారు. గతంలో సాధారణంగా తండ్రి కొడుకులు విడివిడిగానే ఢిల్లీకి వెళ్ళడం జరిగేది. కానీ ఈసారి ఇద్దరూ ఒకేసారి ప్రయాణం చేయడం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో వీరిద్దరూ కేంద్ర నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ సంస్థ అయిన సీఐఐ (CII) సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ను ఆయన కలుసుకోబోతున్నారు. అక్టోబర్ 16న కర్నూలు (Kurnool) జిల్లాలో జరగబోయే జీఎస్టీ 2.0 ప్రచార కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించనున్నారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ఈ కారణంగా బాబు ఆమెను వ్యక్తిగతంగా ఆహ్వానించడం ప్రత్యేకంగా భావిస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి అంశాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జాతీయ స్థాయి రాజకీయ వాతావరణం, భవిష్యత్తు వ్యూహాలపై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక మరోవైపు నారా లోకేష్ కూడా తండ్రి వెంటనే కేంద్ర మంత్రులతో భేటీలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త ప్రణాళికలు వంటి అంశాలను ఆయన చర్చించనున్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రానికి స్పష్టంగా వివరించి సహాయం కోరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ పర్యటన ముగిసిన తరువాత చంద్రబాబు నేరుగా విజయనగరం (Vizianagaram) జిల్లా పర్యటనకు బయల్దేరుతారు. లోకేష్ మాత్రం అమరావతి (Amaravati)కి తిరిగి వస్తారు. తండ్రీ-కొడుకులు కలిసి చేసిన ఈ హస్తిన పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇద్దరూ ఒకేసారి కేంద్ర నాయకత్వాన్ని కలవడం వెనుక ఉన్న రాజకీయ అర్ధాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.