KTR: లొట్టపీసు కాదు.. పక్కా క్విడ్ ప్రో కో..! కేటీఆర్ చుట్టూ ఏసీబీ ఉచ్చు!!
తెలంగాణలో (Telangana) గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ (Formula E Car Rase) వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ మెడకు ఉచ్చులా మారుతోంది. అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో భారీ ఎత్తున అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ (ACB).. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో, ఆయన అరెస్టు ఖాయమనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ పై విచారణ జరుపుతున్న ఏసీబీ, సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో అనేక సంచలన విషయాలు పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ పూర్తిగా అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న ‘సొంత నిర్ణయం’ అని తేల్చింది. క్యాబినెట్ ఆమోదం కానీ, సంబంధిత శాఖల సంపూర్ణ అనుమతులు కానీ లేకుండానే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మళ్లించారని ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ఏ1 గా కేటీఆర్ పేరును చేర్చడం గమనార్హం. ఏ2గా అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి, ఏ4 మరియు ఏ5లుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) ప్రతినిధులను చేర్చింది. కేటీఆర్ ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు జరిగాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
ఏసీబీ నివేదికలో అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన అంశం ‘క్విడ్ ప్రో కో’ (Quid Pro Quo). ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ‘ఏస్ నెక్స్ట్ జెన్’ (Ace Nxt Gen) కంపెనీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను ఏసీబీ బయటపెట్టింది. ప్రభుత్వం, రేస్ నిర్వాహకుల మధ్య అధికారికంగా ట్రైపార్టీ (Tri-party) ఒప్పందం జరగడానికి ముందే.. అంటే 2022 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఈ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏకంగా రూ. 44 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ భారీ విరాళం ముట్టజెప్పిన తర్వాతే, ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి మరీ ‘ఏస్ నెక్స్ట్ జెన్’ కంపెనీకి రేస్ ప్రమోటర్ గా అవకాశం కల్పించారని ఏసీబీ తేల్చింది. ఇది స్పష్టంగా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని, రేస్ నిర్వహణ ముసుగులో పార్టీకి నిధులు సమకూర్చుకున్నారని దర్యాప్తు సంస్థ అంచనా వేస్తోంది.
ఈ రేస్ నిర్వహణలో ఆర్థికపరమైన అవకతవకలే కాకుండా, విధానపరంగా కూడా పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఏసీబీ వెల్లడించింది. 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నిబంధనల ప్రకారం, కోడ్ అమల్లో ఉన్నప్పుడు రూ. 10 కోట్లకు మించిన చెల్లింపులు చేయాలంటే తప్పనిసరిగా స్క్రీనింగ్ కమిటీ లేదా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ, రూ. 55 కోట్లను ఎఫ్ఈవో సంస్థకు చెల్లించేటప్పుడు ఈ నిబంధనను పాటించలేదు. గవర్నర్ సంతకం లేకుండా, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే అప్పటి ఐఏఎస్ అరవింద్ కుమార్ (ఏ2) కాంట్రాక్టులకు ఆమోదముద్ర వేశారని విచారణలో తేలింది. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా, అధికారిక సమావేశాలకు బదులుగా ప్రైవేట్ చర్చలతోనే రేస్ నిర్వహణ నిర్ణయాలు జరిగాయని ఏసీబీ ఆరోపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యవహారంపై అప్పటి సీఎస్ కు కానీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానీ ముందస్తు సమాచారం లేదని నివేదికలో పేర్కొన్నారు.
ఏసీబీ నివేదికలోని అంశాలు కేటీఆర్ ను చట్టపరంగా ఇరకాటంలో పడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా క్విడ్ ప్రో కో ఆరోపణకు బలమైన సాక్ష్యంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని ఏసీబీ ఎత్తిచూపడం కేసును సీరియస్ గా మారుస్తోంది. కేవలం పరిపాలనాపరమైన తప్పిదమే కాకుండా, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ రేస్ నిర్వహించారన్న కోణంలో కేసు నమోదు కావడం బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం, అరవింద్ కుమార్ వాంగ్మూలం, ఎలక్టోరల్ బాండ్ల సాక్ష్యాలు.. ఇవన్నీ కేటీఆర్ అరెస్టుకు దారితీసే అవకాశాలను బలపరుస్తున్నాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎటువంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఫార్ములా ఈ రేస్.. బీఆర్ఎస్ పార్టీకి స్పీడ్ బ్రేకర్ గానే కాకుండా, పెద్ద ప్రమాదంగానూ మారింది.






