Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కేసుపై (AP Liquor Scam Case) చాలా కాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (Peddireddy Midhun Reddy) ఏసీబీ కోర్టు (ACB Court) బెయిల్ (bail) మంజూరు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. 71 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపిన ఆయన సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ మద్దతుదారుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అయితే, ఈ బెయిల్ వెనుక అడ్వకేట్ల లోపాలు, ప్రభుత్వ కుమ్మక్కు, లేదా చట్టపరమైన హక్కులు అనే వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరని, కేసు ఇంకా పెండింగ్‌లో ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. ఏసీబీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. మిథున్ రెడ్డి ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం అక్రమ లావాదేవీలు జరిగాయని, లైసెన్సుల మంజూరులో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. మిథున్ రెడ్డి మీద మద్యం అక్రమ రవాణా, ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. జూలై 20న మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశాయి. తాజాగా ఆయనకు ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచికత్తుతో, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని షరతు పెట్టింది.
టీడీపీ మద్దతుదారులు ఈ బెయిల్‌ను ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నారు. అడ్వొకేట్లు సరిగా వాదించకపోవడం వల్లే మిధున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆరోపిస్తున్నారు. మిధున్ రెడ్డిపై ఛార్జ్ షీట్ నమోదులో దర్యాప్తు సంస్థలు కూడా విఫలమయ్యాయని, తగిన ఆధారాలను చూపెట్టి ఉంటే బెయిల్ వచ్చేది కాదని సూచిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే కేసు నీరుగారిపోతున్నట్టు అర్థమవుతోందని, త్వరలోనే మిగిలిన నిందితులు కూడా బయటకు వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు టీడీపీ నేతలైతే, వైసీపీ నేతలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ బెయిల్‌ను తమ విజయంగా భావిస్తున్నాయి. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా మిథున్ రెడ్డి నిర్దోషి అని తీర్పులు చెప్పేశాయి. న్యాయం గెలిచింది అని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వాస్తవానికి నిందితులకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భారతీయ శిక్షా చట్టం సెక్షన్ 167 ప్రకారం, చార్జ్‌షీట్ 90 రోజుల్లో ఫైల్ చేయకపోతే బెయిల్ దొరుకుతుంది. మిథున్ రెడ్డి 71 రోజులు జైలులో ఉన్నారు కాబట్టి ఇది సహజమే. అయితే బెయిల్ దొరికినంత మాత్రాన నిర్దోషి అయిపోరని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఆయా కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుకు నిందితులు సహకరించాలి. మిధున్ రెడ్డి విషయంలో కోర్టు అనేక షరతులు విధించింది. కాబట్టి లాయర్లు సరిగా వాదించలేదనడం సమంజసం కాదు. అలాగే ఆయన నిర్దోషిత్వం బయటపడిందని వైసీపీ నేతలు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. న్యాయస్థానాల తుది తీర్పు వరకూ వేచి చూడాల్సిందే.!