VVPB: హ్యూస్టన్ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు

హ్యూస్టన్‌లోని శ్రీ రాధా కృష్ణ మందిరంలో సెప్టెంబర్ 20, 2025న జరిగిన విశ్వ వేద పారాయణ బృందం (VVPB) 7వ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. టెక్సాస్ రాష్ట్రం మరియు పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి 500 మందికి పైగా భక్తులు హాజరై, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించారు. రఘు చుండూరు గారు స్థాపించిన ఈ సంస్థ, ఆరేళ్లుగా వేద సంస్కృతిని కాపాడే, ప్రోత్సహించే, పరిరక్షించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పుడు ఇది స్థానికంగా మాత్రమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా సేవలందించే ప్రముఖ సాంస్కృతిక సంస్థగా ఎదిగింది. ఈ కార్యక్రమంలో విశ్ణు సహస్రనామ పారాయణం ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచింది. భక్తి, శ్రద్ధతో నిండిన వాతావరణాన్ని సృష్టించిన ఈ పారాయణం, హాజరైనవారిని వారి ఆధ్యాత్మిక మూలాలకు మరింత దగ్గర చేసింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ రేణు తమిరిస మరియు డాక్టర్ శ్రీనివాసాచార్య తమిరిస గారికి జీవితసాఫల్య పురస్కారాలు ప్రదానం చేయడం ఈ వేడుకలో ముఖ్య ఘట్టంగా నిలిచింది. హ్యూస్టన్‌లోని అష్ట లక్ష్మీ దేవాలయానికి వారు చేసిన సేవలు, సనాతన ధర్మానికి వారు చూపిన అంకితభావం, స్థానిక ఆధ్యాత్మిక వాతావరణంపై చిరస్థాయిగా ప్రభావం చూపాయి.
ఈ పురస్కారాలు వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాక, సమాజాన్ని ముందుకు నడిపించే సేవా భావనను ప్రతిబింబిస్తాయని వివిపిబి ప్రతినిధులు తెలిపారు. చిన్నారులు, యువత కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం హృదయాన్ని హత్తుకునే దృశ్యంగా నిలిచింది. వారి స్వరాలు ఆలయమంతా మార్మోగాయి. వేద సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగించడంలో ఇది విజయ సంకేతంగా నిలిచింది. అమెరికా అంతటినుండి వచ్చిన 12 మంది యువకులు లింగాష్టకం, మహాలక్ష్మీ అష్టకం పారాయణంలో పాల్గొనడం ద్వారా వివిపిబి యొక్క జాతీయ స్థాయి విస్తరణ స్పష్టమైంది. వివిపిబి సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమవకుండా, వేద విద్యార్థులకు, వేద సంస్థలకు మద్దతు ఇవ్వడం, అవసరమైన వారికి వైద్య సహాయం అందించడం వంటి మానవతా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా హాజరైనవారు తమ సాంస్కృతిక మూలాలతో మళ్లీ అనుబంధం ఏర్పడిరదని తెలిపారు. వేద విద్యా, ఆధ్యాత్మికత రెండిరటినీ సమన్వయపరిచింది. వివిపిబి సంస్థ యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేద సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వేద పండితులకు, సంస్థలకు మద్దతు అందిస్తూ, తన సేవా పరిధిని విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. సనాతన ధర్మాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొనసాగించడంలో సంస్థ విశిష్ట పాత్ర పోషిస్తోంది. వేద పండితులకు, సంస్థలకు మద్దతుగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే దాతలను సంస్థ స్వాగతిస్తోంది. వివిపిబి సంస్థ, సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవలను మరింత బలోపేతం చేస్తోంది.
ఈ సంస్థ కార్యక్రమాల గురించి మరింత సమాచారం కోసం www.viswaveda.org వెబ్సైట్ను సందర్శించవచ్చు vvpb@viswaveda.org కు ఇమెయిల్ పంపవచ్చు, లేదా 832 301 9494 (యుఎస్ఎ), 91 99598 43015 (ఇండియా) నంబర్లకు సంప్రదించవచ్చు. వారి Instagram (https://shorturl.at/LWCLr), Facebook (https://shorturl.at/qVr4g), YouTube (https://shorturl.at/PB6Fd)పేజీల ద్వారా తాజా సమాచారం పొందవచ్చు.