H1B Visa: కొత్తగా హెచ్-1 బికోసం దరఖాస్తు దారులకు మాత్రమే లక్షడాలర్ల ఫీజు.. అమెరికా నిపుణుల క్లారిటీ..

ప్రపంచాన్ని షేక్ చేస్తున్న హెచ్ 1బి వీసా (H1B Visa) వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంతో … అంతడబ్బు కట్టేదెలా అన్న అనుమానం, భయం సాఫ్ట్ వేర్ కంపెనీలతోపాటు విద్యార్థులను వేధిస్తోంది. దీంతో ఎవరు డబ్బులు కట్టాలి… ఎవరికి ఊరట అన్నఅనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ క్లారిటీ ఇచ్చింది.
అమెరికాలో ఎఫ్-1 వీసాతో చదువుతున్న విద్యార్థులు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్న అభ్యర్థులు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు వెల్లడించారు. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఆ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు.హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో ‘సీఎం ప్రవాిసీ ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా హెచ్-1బీ ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్-1బీ వీసాల కొత్త ఫీజుపై సందేహాలను యూఎ్‌సఏ ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు.
భారత్ సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వారు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇతర సంస్థలకు మారితే ఈ ఫీజు వర్తించదని తెలిపారు. హెచ్-4 (డిపెండెంట్) వీసాపై ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుంటే లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు.
అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తు అంశంలో ఎవరికి, ఎలాంటి సందేహాలు ఉన్నా ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో సంప్రదిస్తే నివృత్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి జూమ్ ద్వారా వర్జీనియా స్టేట్ సెన్సస్ కమిషనర్ శ్రీధర్ నాగిరెడ్డి, అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు బంగారు రెడ్డి పాల్గొనగా.. ప్రజాభవన్‌లో అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జాష్ డార్లింపెల్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ఇమిగ్రేషన్ నిపుణుడు హరికృష్ణ, రమణారెడ్డి పాల్గొన్నారు.