తీవ్రరూపు దాల్చిన చైనా, తైవాన్ ఉద్రిక్తతలు
తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపు దాల్చాయి. ముఖ్యంగా తైవాన్ లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడకపోవడంతో ఇప్పటికే చైనా ఆగ్రహం ఉంది. దీనికి తోడు తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్-తె బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాపై విరుచుకుపడ్డారు. ఈ విషయం బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిస్పందనగా ఆ ద్వీపదీశం చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో లాయ్ చింగ్ దూకుడు కాస్త తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకొంటూ.. పని చేసేందుకు సిద్ధమేనన్నారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ .. దూకుడు తగ్గించారు… తమకు శాంతి, సుస్థిరత ముఖ్యమన్నారు. ప్రాంతీయ స్థిరత్వం చాలా కీలకం. తైవాన్ జలసంధిలో అలజడులను అంతర్జాతీయ సమాజం అంగీకరించదు. ఈ నేపథ్యంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఈ అంశాన్ని స్వీకరించాలని కోరుతున్నా అని లాయ్ చింగ్ బీజింగ్‌కు పిలుపునిచ్చారు.
చైనాలో తైవాన్ అంతర్భాగమని ఎప్పటి నుంచో చైనా చెబుతూవస్తోంది. అంతేకాదు.. తైవాన్ ను తమ దేశం నుంచి విడదీయాలన్న ప్రయత్నాలు సాగనివ్వమని చెబుతోంది. తైవాన్ సమీపంలో విన్యాాసాలు నిర్వహిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే తైవాన్ మాత్రం .. ఏమాత్రం వెనక్కు తగ్గబోమని కౌంటర్ ఇస్తోంది. తమకు శాంతి ముఖ్యమంటూనే.. ఆక్రమణలను అంగీకరించమని తేల్చి చెబుతోంది. దీనికి తోడు పాశ్చాత్య ప్రపంచం నుంచి అందుతున్న సాయంతో రక్షణపరంగా బలోపేతమయ్యేందుకు తగిన ప్రయత్నాలుచేస్తోంది.
అమెరికా సైతం దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తైవాన్ కు ఆయుధసరఫరా చేయడమే కాదు.. రక్షణపరంగా అండగా ఉండేందుకు సబ్ మెరైన్ లను సైతం పంపిస్తోంది. తైవాన్ పై దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలకు తోడు క్వాడ్రన్ ఏర్పాటు చేసి, ఆయా దేశాలతో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికా విన్యాసాలు నిర్వహించడం చైనాకు సహించరానిదిగా మారింది.






