కెనడా దౌత్యవిదానం పట్టాలు తప్పుతోందా..?
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన నిర్ణయాలతో తరచూ వివాదాస్పదంగా మారుతున్నారు. కేవలం ఒక్కవ్యక్తి, ఓ వర్గం కోసం.. తన విధానాలను సైతం తోసిరాజని ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో లబ్దే ద్యేయంగా ట్రూడో ప్రవర్తిస్తున్నారని స్వదేశంలో సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజ్జర్ హత్య ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తముందని నేరుగా ఆరోపించిన ట్రూడో.. తర్వాత పదేపదే ఆరోపణలు గుప్పించారు. దీనికి భారత్ సైతం కౌంటరిచ్చింది. ఈ అంశం ఇప్పుడు అమెరికా నిశిత పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించిన నిందితుడు నిఖిల్ గుప్తాను.. అమెరికా కోర్టులో హాజరుపరిచారు కూడా.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ వేళ కెనడా ప్రభుత్వం ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది. నిజ్జర్ హత్య జరిగి జూన్ 18నాటికి ఏడాదైన సందర్భంగా ట్రూడో సర్కారు అతడికి ప్రత్యేకంగా నివాళులర్పించింది. అది కూడా.. ఏకంగా దేశ పార్లమెంట్లో ఈ సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ట్రూడో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి చనిపోతే.. కెనడా పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి’’ అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదే కాదు.. గతంలో నాజీయూనిట్ కు చెందిన యొరోస్తవ్ హుంకాను ఉక్రెయిన్ ఫైటర్ గా భావించి.. సాక్షాత్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమక్షంలో కెనడా పార్లమెంటులో సత్కరించారు. అయితే ఆతర్వాత నాజీ వర్గానికి చెందిన వ్యక్తిగా తెలియడంతో.. పార్లమెంటుతో పాటు యూదువర్గానికి క్షమాపణలు చెప్పారు. అంటే కనీసం దానికి సంబంధించి ఎలాంటి విచారణ జరపకుండా.. ఓ విషయాన్ని ట్రూడో బహిర్గతం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇలాంటి చర్యలు.. దేశవిదేశాంగ విదానానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలియాల్సి ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారతదేశంతో సత్సంబందాల కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగావ్యాపార లావాదేవీలకు ప్రాధాన్యతపెరగడంతో.. ఆదిశగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ సమయంలో కెనడా ప్రధానమంత్రి ట్రూడో మాత్రం..కేవలం ఖలిస్తాన్ వాదుల కోసం మాత్రమే పనిచేస్తూ.. ఓ అతిపెద్ద దేశాన్ని దూరం చేసుకుంటున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని.. ట్రూడో సర్కార్ ప్రోత్సాహంతో కెనడా కూడా మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.






