Islamabad: అవును ఉగ్రవాదంతో మా సంబంధాలు నిజమే.. పాక్ నేతల ఒప్పుకోలు…

గతంలో ఎన్నడూ ఉగ్రవాదంతో లింకులు అంగీకరించని పాక్ నేతలు.. ఇప్పుడు ఒకొక్కరుగా బయటపడుతున్నారు. అవును.. గతంలో మాకు ఉగ్రవాదంతో సంబంధాలుండేవి. మేం పశ్చిమదేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం..ఇప్పుడు దాని దుష్ఫలితాలతో బాధపడుతున్నామని చెబుతున్నారు. అది కూడా బహిరంగంగానే… ఆఫ్గనిస్తాన్ పై సోవియట్ యుద్దం చేసిన సమయంలో .. తాము అమెరికా కోసం ముజాహిద్దీన్ లను తయారు చేాశామని.. ఇప్పుడు అదే తమను వెంటాడుతోందంటున్నారు. దీంతో పాకిస్తాన్ కు ఉగ్రవాద చరిత్ర ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అంగీకరించారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఆర్థిక సాయం పాక్ అందించిందని ఇటీవల ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ భుట్టో అదేతరహా వ్యాఖ్యలు చేశారు.
‘‘రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం.. పాకిస్థాన్‌కు గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్థాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం’’ అని భుట్టో వెల్లడించారు.
పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇక ఈ ఘటన తర్వాత పాక్ నడ్డివిరిచేలా భారత ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి.