బెంగాల్ లో శవరాజకీయాలు..

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ వైద్యురాలు ఏకంగా 36 గంటల పాటు విధులు నిర్వహించి, అలసి గాఢ నిద్రలో ఉండగా.. దుండగులు హత్యాచారానికి తెగబడ్డారు. అయితే ఇందులో పోలీస్ వాలంటీర్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ ఘటనలో మృతురాలి శరీరంలో సెమెన్ పర్సంటేజ్ అధికంగా ఉందని…. గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చన్న అనుమాానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇవన్నీ కల్పితగాథలంటూ కొట్టిపడేస్తున్నారు బెంగాల్ పోలీసులు. డాక్టర్ పై హత్యాచార ఘటన వెలుగుచూడడంతో…. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు.. వైద్యసంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నాయి. బంద్ లు సైతం పాటిస్తున్న పరిస్థితులున్నాయి. మరోవైపు.. ఈఘటన రాజకీయ రంగు పులుముకుంది.. ఈకేసులో మమత సర్కార్ వైఫల్యముందంటూ విరుచుకుపడుతున్నాయి. దీనిలో టీఎంసీ నేతలు, కార్యకర్తల హస్తముందని.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తోంది.
అందుకే ..ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ పోలీసులు కావాలనే నిర్లిప్తంగా వ్యవహరించారని దుమ్మెత్తిపోస్తోంది.. ఈ కేసు పర్యవసానాలు, వాటి వెనక రాజకీయ ఉద్దేశాలను గుర్తించిన మమతాబెనర్జీ.. స్వయంగా రంగంలోకి దిగారు. తమ కేడర్, నాయకులతో కలిసి కోల్ కతాలో భారీ ర్యాలీ తీశారు.అంతే కాదు.. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మమత రాజకీయంగా మాస్ లీడర్.. కాబట్టి , ఈఅంశంలో తమ పార్టీ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి దీన్ని ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
విపక్షాల ఆరోపణలను బలంగా తిప్పికొట్టేందుకే మమత ఇలా వ్యవహరించారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును కలకత్తా హైకోర్టు.. సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ విచారణ, కోల్ కతా హైకోర్టు పర్యవేక్షణ జరుగుతుండడంతో… ఈకేసులో మృతురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.మరోవైపు… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నది నిర్వివాదాంశం.