రెండురోజుల్లో రాజీనామా.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆయన శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. నేను నిజాయితీ ఉన్నానని భావిస్తే.. నాకు ఓటేసి మళ్లీ గెలిపించాలని కోరారు.
మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. తాను అగ్ని పరీక్షను ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఆయన రిజైన్ చేసి.. వేరేవ్యక్తిని ఢిల్లీపీఠంపై కూర్చోపెట్టాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ అంశంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లను కొల్లగొట్టాలన్నది కేజ్రీవాల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. దీనికి తోడు కేజ్రీవాల్ పై లిక్కర్ కేసు నమోదైంది కాబట్టి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఇప్పుడు రాజీనామా చేస్తే.. బీజేపీకి సైతం అస్త్రం లేకుండా పోతుంది. దీంతో తమకు మరింత లాభం కలుగుతుందని ఆప్ నేతలు సైతం భావిస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లరాదని, ఫైల్స్‌పై సంతకాలు చేయరాదని షరతు విధించింది. ఈడీ కేసులో వేరే ధర్మాసనం ఈ కండిషన్ పెట్టడంతో.. సీబీఐ కేసులో బెయిలిచ్చిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆ నిబంధనలు తాము ఎత్తివేయలేమని పేర్కొంది. కానీ, ఆ ధర్మాసనం ఆదేశాలను తప్పుబట్టింది.
ఇక, జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కుట్రపై సత్యమే గెలిచిందని అన్నారు. దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. ఇక, తీర్పు సమయంలో సీబీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికింది. సుదీర్ఘంగా జైలులో ఉంచడమంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని అధికరణం 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టంచేసింది.