PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులుది బరితెగింపా, నమ్మకమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామ ఆంజనేయులు (PSR Anjaneyulu)ను ముంబై నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jetwani) వేధింపుల కేసులో ఏపీ సీఐడీ (AP CID) అధికారులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉండగా, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు జరిగింది. అయితే, ఆంజనేయులు చూపిన వైఖరి, ఆయన నిర్ణయాలు బరితెగింపుగా భావించాలా, లేక తనపై తనకున్న నమ్మకంగా పరిగణించాలా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
2024 ఫిబ్రవరిలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya Sagar) ఫిర్యాదు మేరకు కాదంబరి జెత్వానీపై కేసు నమోదైంది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి, 40 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రానా టాటా (Kanti Rana Tata), డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలపై (Vishal Gunni) వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాదంబరి జెత్వాని ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు విషయంలో ఆసక్తికర అంశం ఏమిటంటే, అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయలేదు. ఈ కేసులో మిగిలిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందగా, ఆంజనేయులు మాత్రం “ఒక్కసారి జైలుకు వెళ్లాలనుకున్నాను” అని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కోర్టులో వాదించేందుకు ఆయన లాయర్‌ను కూడా నియమించుకోలేదు. తన వాదనలను తానే వినిపించుకున్నారు. ఈ వైఖరి ఆయనపై ఆయనకున్న నమ్మకమా లేకుంటే వీళ్లేం చేసుకుంటారులే అనే బరితెగింపా అనేది చర్చనీయాంశంగా మారింది.
మరో వివాదాస్పద అంశం ఏమిటంటే సస్పెన్షన్‌లో ఉన్న అధికారి రాష్ట్రం విడిచి వెళ్లకూడదనే నిబంధన ఉంది. కానీ పీఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘన. ఈ పరిణామాలు ఆయన వైఖరిని బరితెగింపుగా చిత్రీకరిస్తున్నాయి. అయితే, ఆంజనేయులు తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. వైఎస్ఆర్‌సీపీ హయాంలో కీలక పదవుల్లో ఉన్నందున టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని వాదిస్తున్నారు.
రాజకీయ వైరం, అధికార దుర్వినియోగం ఆరోపణల మధ్య పీఎస్ఆర్ ఆంజనేయులు వైఖరి వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా తెలియడం లేదు. ఆయన నమ్మకం న్యాయవ్యవస్థపై ఉందా, లేక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలబడాలనుకున్నారా అనేది సమయమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, న్యాయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది.