Chandrababu gari taluka: పవన్ తర్వాత చంద్రబాబు… తాలూకా హంగామాలో నిజం ఎంత?

గత ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram)లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిచిన తర్వాత అక్కడి పరిస్థితి మారిపోయింది. “పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా” అంటూ బోర్డులు పెడుతూ, భారీగా బ్యానర్లు కూడా పెట్టారు. కొంత మంది యువకులు జయగానాలు పాడుతూ, బైకుల సైలెన్సర్లు తీసేసి ఊరేగింపులు నిర్వహించారు. అప్పుడు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారు. ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని, ఆ పేరుతో ఉన్న బోర్డులు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అప్పటి నుంచి అలాంటి ప్రకటనలు కనిపించకుండా పోయాయి.
కట్ చేస్తే ఇప్పుడు అదే తీరులో “చంద్రబాబు గారి తాలూకా” (Chandrababu gari taluka) అంటూ కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. నూజివీడు (Nuzvid) నియోజకవర్గంలో ఒక కాంట్రాక్టర్ మట్టి కొండల్ని కరిగించి తరలిస్తున్నాడు. అధికారుల ప్రశ్నించడంతో, ఆయన “అమరావతిలో చంద్రబాబు (Chandrababu Naidu) ఇంటికి తీసుకెళ్తున్నాం” అని సమాధానమిచ్చాడు. అయితే అసలాయన ఇంటికీ, ఆ మట్టికీ సంబంధం లేదని విచారణలో తేలింది.
ఇంకా, కుప్పం (Kuppam) ప్రాంతంలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను ఆపగా, “చంద్రబాబు ఇంటికి పంపుతున్నాం” అని డ్రైవర్లు చెప్పారు. కానీ ఆ ఇంటి పనులు ఇప్పటికే పూర్తయినట్టు పార్టీ నాయకులే వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు లారీలను వెతకగా, అవి అప్పటికే పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. గుడివాడ (Gudivada)లోని రావి కమతం ప్రాంతంలో కూడా ఒక కాంట్రాక్టర్ లీజు గడువు ముగిసిన తర్వాత కూడా మట్టిని తరలిస్తూ ట్రక్కులపై “చంద్రబాబు గారి తాలూకా” అని బోర్డులు పెట్టాడు. దీనిపై స్థానికుల ఆగ్రహంతో రెవెన్యూ శాఖ జోక్యం చేసుకుని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇలా అప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మీద హంగామా జరిగింది, ఇప్పుడు చంద్రబాబు పేరు మీద అక్రమాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నాయకుల పేర్లను ఉపయోగించి కొందరు వ్యక్తులు సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థను మోసం చేస్తూ, చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.