Washington: ఉక్రెయిన్ కు సాయంలో అమెరికా, యూరప్ చెరోవైపు…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. యుద్ధాన్ని నిలుపుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్… ఆ దిశగా ఇరుదేశాలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు.. ఆదేశం తీరుపై అనుమానాలు పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో స్నేహబంధాన్ని పెంచుకోవడం.. ఉక్రెయిన్ ను యుద్ధం ఆపాలంటూ ఒత్తిడి తేవడంపై యూరప్ దేశాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం (USA) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో కీవ్ (Ukraine)కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపివేసింది. వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
‘అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టి సారించారు. మా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోంది’ అని ఆ అధికారి తెలిపారు. అయితే, ఇది తాత్కాలికమేనని వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యా (Russia) చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతిఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ గతవారం శ్వేతసౌధానికి వెళ్లారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌లకు ఆగ్రహం తెప్పించింది. సాయం అందించిన దేశానికి కృతజ్ఞతలు చెప్పడం మాని.. అవమానిస్తున్నారంటూ వారు జెలెన్స్కీపై మీడియా ముందే మండిపడ్డారు. ఈ చర్చలు కాస్తా రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధం నుంచి జెలెన్స్కీ బయటకు వచ్చేశారు.
ఇక, అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం జెలెన్స్కీ పేర్కొన్నారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ట్రంప్‌తో మరోసారి భేటీకి వెళ్తానన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూరతీరంలోనే ఉందని, అప్పటివరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈనేపథ్యంలోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపివేయడం సంచలనం సృష్టించింది.






