NDA: తెలంగాణాలో కూటమి యాక్షన్ ప్లాన్

గత ఏడాది నవంబర్ నుంచి తెలంగాణలో ఎన్డీఏ(NDA) కూటమి రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ(TDP) తెలంగాణలో అడుగుపెట్టే అవకాశాన్ని గురించి మీడియాతో పాటుగా సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కాస్త కూస్తో బలం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా ఉపయోగపడే అంశంగానే చెప్పాలి. 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కాస్త కలిసి వచ్చింది.
తెలుగుదేశం పార్టీలో ఉన్నా రేవంత్ రెడ్డి అభిమానులు.. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఇక భారత రాష్ట్ర సమితి పై పోరాటం చేసే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగితే వాళ్లందరూ మళ్ళీ తమ పార్టీ కోసం పనిచేసే అవకాశాలుంటాయి. దీనిని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక జనసేన పార్టీ కూడా తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ మీద మాత్రమే దృష్టి పెట్టారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగాలని భావిస్తోంది. తనకు బలం ఉన్న.. నల్గొండ, ఖమ్మం జిల్లాల మీద ఎక్కువగా తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో కూడా కాస్త బలంగానే ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్లినవారు.. తెలంగాణలో హైదరాబాదులో ఎక్కువగా స్థిరపడ్డారు.
అలాగే ఖమ్మం జిల్లాలో కూడా వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అటు మెదక్ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త బలం ఉంది. దీనితో బీజేపీ ఇప్పుడు జాగ్రత్తగా రాజకీయం చేయాలని భావిస్తోంది. చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణలో పోటీ చేసే అంశం గురించి చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.