Modi : మహిళ భద్రత కోసం ఎంతో ప్రాధాన్యం : మోదీ

గత పదేళ్లుగా మహిళ భద్రత కోసం తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని మోదీ (Modi) పేర్కొన్నారు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గుజరాత్ (Gujarat)లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లా డారు. మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే, తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ అబ్బాయిల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ వారికి కూడా ప్రశ్నించాలి. గడిచిన దశాబ్దంలో మహిళల భద్రత, మహిళలపై జరుగుతోన్న నేరాలను అరికట్టేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. నిబంధనలు, చట్టాలు కూడా మార్చాం. అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో మరణశిక్ష (Death penalty) విధించేలా చట్టాలు సవరించాం అని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ ఉద్ఘాటించారు. దేశ ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీజీ (Gandhiji) చెప్పిన మాటను గుర్తు చేసిన ఆయన, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా దానికి జత చేయాలనుకుంటున్నాని చెప్పారు. త్రిపుల్ తలాక్ (Triple Talaq )కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళ (Muslim women )ల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు. మహిళల సారథ్యంలోని ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలో అత్యంత ధనికుడిననని కార్యక్రమ ఆరంభంలో మోదీ చెప్పారు.