ఒబామా రాకకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా

అమెరికా విదేశాంగ విధానాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2015లో భారత గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకను ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా వామపక్షవాదులను ఏకం చేసి, ఒబామా రాకకు నిరసనగా ఎక్కడికక్కడ ప్రదర్శనలను నిర్వహించారు. ఇస్లాం మతంలో ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణమని ఏచూరి నిందించేవారు. పశ్చిమాసియాలో అమెరికా జోక్యంతోనే అశాంతి నెలకొంటోందని, ఇస్లామిక్ స్టేట్ ( ఐఎస్) మారణహోమానికి కూడా అమెరికా తీరే కారణమని విమర్శించేవారు. ప్రపంచంపై అమెరికా పెత్తనాన్ని నిలదీసేవారు. ప్రపంచంలోని వనరులు, ముఖ్యంగా ఇంధన వనరులను దోచుకోవడానికి పెత్తనం చెలాయించడానికి అమెరికా అర్రులు చాస్తోందని మండిపడేవారు.