Air India: ఎయిర్ ఇండియాకు ఏమైంది సార్..?

ప్రముఖ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియాకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల అహ్మదాబాద్(Ahmedabad) లో జరిగిన విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎయిర్ ఇండియా(Air India) పై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాంకేతిక లోపం ఉన్న విమానాలను ఈ సంస్థ నడుపుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు విమానాల్లో సిబ్బంది అనుసరిస్తున్న వైఖరిపై కూడా విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని ఇటీవల కాలంలో వైరల్ అయ్యాయి. ఇక వరుసగా సాంకేతిక లోపాలతో విమానాలు ఆగిపోవడం కలవరపెడుతోంది.
విమాన ప్రమాదానికి ముందు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోని ఎయిర్ ఇండియా.. ఆ తర్వాత నుంచి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఇక తాజాగా ఓ విమానాన్ని అధికారులు రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో ప్యారిస్ బయలుదేరాల్సిన ఒక విమానాన్ని ఢిల్లీలో అధికారులు అడ్డుకున్నారు. ముందస్తు తనిఖీల్లో భాగంగా ఏఐ 143 విమానంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు టికెట్ డబ్బును రిఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ప్రయాణం రీ షెడ్యూల్ కు సైతం అవకాశం కల్పించింది.
ఇక రేపు పారిస్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా 142 విమానం కూడా రద్దు చేశారు. ఇలా పలు విమానాలను సాంకేతిక కారణాలు వెంటాడటంతో ఎయిర్ ఇండియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టాటా సంస్థ(TaTa Group) ఎయిర్ ఇండియా బాధ్యతలను తీసుకున్న తర్వాత లాభాల బాట పట్టగా.. ఇప్పుడు వరుసగా నష్టాలు వెంటాడుతున్నాయి. వారం పది రోజుల్లోనే ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి తలెత్తింది. దానికి తోడు ఆ సంస్థ నడుపుతున్న బోయింగ్ విమానాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసిన కొన్ని విమానాలను ఎయిర్ ఇండియా ఇప్పటికీ వాడుతోంది. అయితే ఆ విమానాలను పక్కనపెట్టి కొత్త విమానాలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు.