Jagan: అసెంబ్లీలో వైసిపి గైర్హాజరు…కూటమికి ఏమిటి నష్టం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న వేళ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అధికార టీడీపీ (TDP) వర్గాల నుంచి ప్రతిపక్ష వైసీపీ (YSRCP) హాజరు కావాలంటూ వరుసగా పిలుపులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) నుంచి మంత్రులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) వరకు కూడా పదేపదే జగన్ (Jagan Mohan Reddy) సభకు రావాలని కోరుతున్నారు. మైక్ ఇస్తామని, మాట్లాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తూ ముందుకు రావడం విశేషం.
అయితే వైసీపీ మాత్రం తమ నిర్ణయంపై స్పష్టంగా నిలిచింది. ప్రతిపక్ష హోదా (Opposition Status) ఇవ్వకపోతే అసెంబ్లీకి హాజరు కావడం జరగదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని పార్టీ నాయకులు కట్టుబడి అమలు చేస్తామని చెబుతున్నారు. ఇంతకీ వైసిపి గట్టి నిర్ణయం తీసుకున్న తరువాత కూడా అధికార పార్టీ ఎందుకు వరుస పిలుపులు ఇస్తోంది? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) నాయకులే కనిపిస్తున్నారు. వైసీపీ గైర్హాజరుతో ప్రజల తరపున ప్రశ్నించే శక్తి తగ్గిపోయిందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా అదే దిశగా సాగుతోంది. “మా తప్పు కాదు, అధికార కూటమి తప్పే” అని వారు చెబుతున్న తీరు ప్రజల్లో ప్రభావం చూపే అవకాశముందని సీఎం సహా స్పీకర్ కూడా అంచనా వేస్తున్నారు.
ఇందుకే ప్రభుత్వం పదేపదే వైసీపీ ని రావాలని కోరుతూ తమ వైపు తప్పు లేదని చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కానీ సాధారణ ప్రజల్లో మాత్రం ఒక సందేహం తలెత్తుతోంది. రానని ముందే చెప్పిన వారిని ఎందుకు ఇంతగా బ్రతిమాలుతున్నారు? వస్తే వస్తారు, రాకపోతే రారు. అయితే ఎందుకు అంతగానూ కోరుకుంటున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల మధ్యనూ గట్టిగా వినిపిస్తోంది.
అసలే ఒకసారి చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు, జగన్ సభను బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆయనను ఒక్కసారైనా సభకు రమ్మని ఎవ్వరూ ఆహ్వానించలేదు. ఇప్పుడు పరిస్థితి మారగానే జగన్ కోసం వరుస విజ్ఞప్తులు రావడం “మిలియన్ డాలర్ ప్రశ్న”గా (Million Dollar Question) మారింది. ఈ విధానం వలన అధికార కూటమి తనదైన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీని బ్రతిమాలుతోందన్న అనుమానం కలుగుతోందని కొంతమంది టిడిపి నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.మరోపక్క రానని నిర్ణయించుకున్న వైసీపీని పిలుస్తూనే ఉండడం వలన, ప్రభుత్వం తన బలహీనతను బహిర్గతం చేసుకుంటోందన్న అభిప్రాయం మాత్రం పెరుగుతోంది.