Nara Lokesh:నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం : లోకేశ్

నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చర్యలు చేపట్టారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS) లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్ (Nepal) లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేశ్‌కు వివరించారు. 4 ప్రాంతాల్లో సుమారు 190 మంది తెలుగు వారు చిక్కుకున్నట్లు తెలిపారు. గౌశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55, బఫాల్‌లో 27, సిమిల్‌కోట్‌లో 12 మంది ఉన్నట్లు వెల్లడిరచారు. వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి వీడియో కాల్‌లో మాట్లాడారు. సూర్యప్రభ (Suryaprabha) అనే మహిళ అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేశ్ భరోసా ఇచ్చారు.