మహిళలపై అకృత్యాలకు కఠిన శిక్షలు తీసుకురావాలి: ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న సమయంలో మమత ఈ లేఖ రాయడం గమనార్హం. ఈ కేసు విచారణపై మండిపడిన ప్రజలు.. సీఎం మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధానికి లేఖ రాసిన మమతా బెనర్జీ.. అత్యాచార కేసులపై కఠిన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ముఖ్య సలహాదారు బందోపాధ్యాయ ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న అత్యాచార కేసులను తన లేఖలో ప్రధాని దృష్టికి మమత తీసుకువెళ్లారని ఆయన చెప్పారు.