Kolkata: రాత్రి పూట అమ్మాయిలు బయటకు వెళ్లకపోవడమే బెటర్.. దీదీ సంచలన వ్యాఖ్యలు..!

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమ్మాయిలు, ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు. అయితే, ఇలాంటి కిరాతక ఘటనలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె స్పష్టం చేశారు.
“బయటి రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. రాత్రిపూట ఎవరు ఎక్కడికి వెళుతున్నారో పోలీసులకు తెలియదు. ప్రతి ఇంటికీ వెళ్లి పోలీసులు కాపలా కాయలేరు కదా. రాత్రి 12:30 గంటలకు బయటకు వెళ్లినప్పుడు ఏదైనా జరిగితే…! ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి” అని మమతా బెనర్జీ అన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కూడా బాధ్యత ఉంటుందని ఆమె గుర్తుచేశారు.
ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన ఓ యువతి దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితుడితో కలిసి భోజనం కోసం కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిని వెంబడించి, అసభ్యంగా ప్రవర్తించారు. విద్యార్థిని స్నేహితుడిని బెదిరించి పంపించివేసి, ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా లాక్కుని పడేశారు.
కాసేపటి తర్వాత ఆ స్నేహితుడు మరికొందరితో కలిసి అక్కడికి చేరుకోగా, విద్యార్థిని గాయాలతో కిందపడి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి షేక్ రియాజుద్దీన్, అపు బౌరి, ఫిర్దోస్ షేక్‌లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా స్పందించింది. ఐదు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని పశ్చిమ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. విద్యార్థినికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మెడికల్ కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.