Kabul: పాక్ పై ఆఫ్గన్ ప్రతీకార దాడులు.. 58 మంది సైనికులు హతం..!

అఫ్గనిస్తాన్ (Afghanistan) లోని పలు ప్రాంతాల్లో పాక్ ఫైటర్ జెట్లు దాడులు చేయడంపై మండిపడ్డ తాలిబన్లు.. తామేంటో పొరుగుదేశానికి చూపించారు. సరిహద్దుల్లో పాక్ బలగాలపై దాడులు చేశారు. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించింది.
దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ (Pakistan) బాంబు దాడులు చేసిందని అఫ్గానిస్థాన్ ఇటీవల ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు సమాచారం. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 58 మంది పాక్ సైనికులు మృతి చెందారని, మరో 30 మంది గాయపడ్డారని చెప్పారు. పాక్ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉద్ధృతం చేస్తాయని హెచ్చరించారు.
పాక్ – అఫ్గాన్ బలగాల మధ్య ఘర్షణలు
ఇటీవల అఫ్గానిస్థాన్ (Afghanistan) రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ యుద్ధవిమానాలు దాడి చేసినట్లు పాక్ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, ఈ దాడులపై ఇస్లామాబాద్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ విదేశాంగమంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.