China: అమెరికా టారిఫ్ యుద్ధంపై చైనా ఘాటు రియాక్షన్..

చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు (100% tariffs on Chinese imports) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై చైనా (China hit back US President) వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా తాము ఎవరితో ఘర్షణలకు దిగమని.. అవసరం వస్తే పోరాడటానికి వెనకాడమని స్పష్టం చేసింది. ప్రతి చర్యలు (counter-measures) కూడా ఉంటాయని తెలిపింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది.
అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ (Donald Trump) ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈక్రమంలోనే చైనా (China) దిగుమతులపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టి దీనిపై యూఎస్ నిర్ణయం ఉంటుందన్నారు.
గతంలోనూ అమెరికా- చైనాల మధ్య వాణిజ్యయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్ష్యంగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్‌కు ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ.. అది ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.