YCP: కూటమి రాజకీయాల్లో ఇమడలేని మాజీ మంత్రులు.. వైసీపీలోకి రీ ఎంట్రీకి సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పరిస్థితులు క్షణం క్షణం మారిపోతున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓటమి పాలవడంతో ఆ పార్టీలో కీలకంగా పనిచేసిన పలువురు నేతలు అధికార కూటమి వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో ఆ పార్టీ భవిష్యత్తు లేదని భావించిన నేతలు, వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ స్థిరత్వం కోసం టిడిపి (TDP), జనసేన (JanaSena) పార్టీలలో చేరారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ నేతల్లో కొందరు మళ్లీ వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాల వారీగా చూస్తే, వైసీపీని విడిచి వెళ్లిన వారిలో చాలా మంది కొత్త పార్టీల్లో సరైన గుర్తింపు పొందలేదనే భావన కలిగింది. ముఖ్యంగా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy), ఆళ్ల నాని (Alla Nani), మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana) వంటి నేతలకు కూటమి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదని అంటున్నారు. ఒకప్పుడు జిల్లాల్లో ప్రభావవంతమైన నేతలుగా ఉన్న వీరు ఇప్పుడు కొత్త పార్టీల్లో రెండో శ్రేణి నేతలుగా మారిపోయిన పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను (Uday Bhanu), కిలారు రోశయ్య (Kilari Rosayya), పెండెం దొరబాబు (Pendem Dorababu) వంటి వారు తమ స్థాయిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, పార్టీ అంచనాలకు తగ్గ గుర్తింపు అందలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పని చేస్తున్నప్పటికీ, పెద్దగా రాజకీయ ప్రభావం చూపలేకపోయారు. ఇదే సమయంలో దొరబాబు పిఠాపురం (Pithapuram) ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఆయనకూ పెద్దగా అవకాశాలు రాలేదు.
వైసీపీకి చాలా కాలం సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి (V. Vijayasai Reddy) అయితే రాజకీయ సన్యాసం ప్రకటించి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. కానీ పార్టీని విడిచి వెళ్లిన ఇతర నేతలు మాత్రం ఇప్పుడు మళ్లీ పాత గూటికి చేరాలా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే వైసీపీ నాయకులతో అనధికారికంగా సంప్రదింపులు ప్రారంభించినట్టు చెబుతున్నారు. మరికొందరు మాత్రం జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నుంచి ఆహ్వానం వస్తే తిరిగి చేరతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ నేతల పరిస్థితి “ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి” అన్నట్లు మారింది. కొత్త పార్టీల విధానం, పనితీరు తమ రాజకీయ ధోరణికి సరిపోకపోవడం వల్ల వారు అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. తమ గత రాజకీయ జీవితం వైసీపీ, అంతకు ముందు కాంగ్రెస్ (Congress) వాతావరణంలో సాగిందని, ఇప్పుడు కూటమి పార్టీల ధోరణి పూర్తిగా భిన్నంగా ఉందని కొందరు సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం.
ఇలా, ఈ రాజకీయ వలసదారుల భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో, నిజంగా ఎవరైనా మళ్లీ వైసీపీలో చేరుతారా లేదా అన్నది చూడాల్సిందే. కానీ ఈ ప్రచారం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తావిస్తోంది.