Pawan Kalyan: విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఒక విజిల్ బ్లోయర్ లాగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై, కీలక నిర్ణయాలపై ఆయన తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్న ప్రతిసారీ ఆయన ఒక విజిల్ బ్లోయర్‌గా స్పందిస్తున్నారు. ప్రభుత్వంలోని లోపాలను, అన్యాయాలను ముక్కుసూటిగా కేబినెట్ దృష్టికి తీసుకెళ్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర మంత్రులను పునరాలోచించేలా చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ తాజాగా లులూ గ్రూప్ (Lulu Group)కు భూ కేటాయింపులపై కేబినెట్ లో ప్రస్తావించారు. లులూ గ్రూప్‌కు భూములు కేటాయించే విషయంలో ఆ గ్రూప్ కొన్ని గొంతెమ్మ కోరికలు పెడుతున్నట్టు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్, ఆయనతో పాటు జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. లులూ గ్రూప్‌కు భూములు కేటాయించే ప్రాతిపదిక ఏమిటి? స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎలాంటి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి? ఒక ప్రైవేట్ సంస్థకు అతిగా రాయితీలు కల్పించడం ఎంతవరకు సమంజసం? –వంటి కీలక ప్రశ్నలను పవన్ కల్యాణ్ కేబినెట్‌లో లేవనెత్తినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అభ్యంతరాలను, ప్రశ్నలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ గ్రూప్‌కు భూ కేటాయింపుల విషయంలో పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ పెట్టిన షరతులు, నిబంధనలపై స్పష్టత వచ్చేవరకు ఈ అంశాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది.
గతంలో శాంతిభద్రతల అంశంపైన కూడా పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆ మధ్య వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఘటనలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల విషయంలో పోలీసులు, అధికారులు కులం, మతం, రాజకీయాల అండ చూసుకుని చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. క్రిమినల్స్‌ను యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు చేస్తాను” అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, హోంమంత్రి వంగలపూడి అనిత ఈ విషయంలో బాధ్యత వహించాలని సూటిగా చెప్పారు.
దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ కావాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌ను స్వయంగా కలిసి, శాంతిభద్రతల అంశాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లులూ గ్రూప్, శాంతిభద్రతలే కాకుండా గతంలోనూ పవన్ కల్యాణ్ కేబినెట్‌లో పలు కీలక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపారు. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అదనంగా భూములు సేకరించాలన్న ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకు వెళ్లవద్దని ఆయన స్పష్టం చేయడంతో, ఆ ప్రతిపాదనపై ప్రభుత్వం దూకుడుకు బ్రేక్ పడింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణ ప్రతిపాదనపైనా పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పారు. వ్యవసాయ భూమి దుర్వినియోగం అవుతుందని రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రతిపాదనను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే, కేవలం ఉప ముఖ్యమంత్రిగా తన శాఖల బాధ్యతలకే పరిమితం కాకుండా, ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలపై సామాన్య ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రయోజనాల పక్షాన పవన్ కల్యాణ్ ఒక విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కూటమి ప్రభుత్వంపై లోపాలు, అన్యాయాలు జరుగుతున్నాయన్న అపవాదు రాకుండా ఆయన చర్యలు అడ్డుకుంటున్నాయి.